ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. బంగ్లాదేశ్‌లో భారతీయులకు అలర్ట్

బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను తొలగించాలని కోరుతూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆ దేశంలో ఉన్నటువంటి భారతీయులకు కేంద్రం తాజాగా కీలక సూచనలు జారీ చేసింది.

Update: 2024-07-18 08:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను తొలగించాలని కోరుతూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆ దేశంలో ఉన్నటువంటి భారతీయులకు కేంద్రం తాజాగా కీలక సూచనలు జారీ చేసింది. భారతీయ పౌరులు, విద్యార్థులు తమ ప్రయాణాలను కొద్దిరోజుల పాటు వాయిదా వేసుకోవాలని, అలాగే అనవసరంగా తమ నివాసాల నుంచి బయటకు రాకూడదని ఢాకాలోని భారత హైకమిషన్ అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. ఇటీవల అల్లర్లు హింసాత్మకంగా మారడంతో అక్కడి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో భారత ఎంబసీ ఈ అలర్ట్‌ను జారీ చేయడం గమనార్హం.

గురువారం, ఢాకా అంతటా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు భద్రతా సిబ్బందితో ఘర్షణ పడ్డారు. బ్రాక్ యూనివర్శిటీ సమీపంలోని మెరుల్ బద్దాలో నిరసనకారులు రోడ్లను మూసివేయడంతో వారికి పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. తెల్లవారుజామూనే వేలాది మంది నిరసనకారులు రోడ్లపై గుంపులుగా చేరడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను మోహరించారు.

విద్యార్థులు జత్రాబరిలో ఢాకా-చిట్టగాంగ్ హైవేపై ఆందోళన చేయడంతో తీవ్రంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అనేక స్థానిక మార్కెట్లు, దుకాణాలను మూసివేశారు.

అస్థిర పరిస్థితుల దృష్ట్యా, అవసరమైన సహాయం కోసం భారతీయ పౌరులు, విద్యార్థులు ఫోన్ కాల్ ద్వారా సంప్రదించాలని భారత ఎంబసీ సూచించింది. ఆ నెంబర్లు.. ఢాకా హైకమిషన్ కార్యాలయం నెం: 880-1937400591,చిట్టగాంగ్: 880-1814654797 / 880-1814654799, సిల్హెట్: 880-1313076411, ఖుల్నా: 880-1812817799. ఈ నెంబర్లకు సాధారణ కాల్స్‌తో పాటు వాట్సాప్‌లో కూడా సంప్రదించవచ్చని కోరింది.

Tags:    

Similar News