రష్యా నదిలో గల్లంతైన నలుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

రష్యాలో భారత్‌కు చెందిన నలుగురు వైద్యవిద్యార్థులు ప్రమాదవశాత్తు వోల్ఖోవ్‌ నదిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-08 10:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలో భారత్‌కు చెందిన నలుగురు వైద్యవిద్యార్థులు ప్రమాదవశాత్తు వోల్ఖోవ్‌ నదిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగా మిగతా ఇద్దరి కోసం నదిలో గాలించారు. అయితే గల్లంతైన మిగిలిన మృతదేహాలను రష్యా అధికారులు స్వాధీనం చేసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారి శనివారం తెలిపారు. మృతదేహాలను ముంబైకి తరలించి,ఆ తర్వాత జల్గావ్ జిల్లాలోని విద్యార్థుల స్వస్థలాలకు తీసుకెళ్తామని, జల్గావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు.. హర్షల్ అనంతరావ్ దేసాలే, జిషాన్ అష్పాక్ పింజారీ, జియా ఫిరోజ్ పింజారీ, మాలిక్ గులామ్‌గౌస్ మహ్మద్ యాకూబ్‌. మరో విద్యార్థి నిషా భూపేష్ సోనావానే ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ కూడా 18, 20 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. చనిపోయిన వారిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు.

వీరంతా కూడా యారోస్లావ్-ది-వైజ్ నొవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు. విద్యార్థులు వోల్ఖోవ్ నది వెంబడి నడకకు వెళ్లగా, వారిలో ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో ఆమెను కాపాడటానికి మిగిలిన నలుగురు కూడా నీటిలో దిగడంతో కాపాడే ప్రయత్నంలో వారు నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే స్థానికులు ఒక అమ్మాయిని కాపాడగా, సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలను మొదట కనిపెట్టగా, మిగిలిన ఇద్దరి డెడ్‌బాడీలను తాజాగా స్వాధీనం చేసుకున్నారు.


Similar News