Pakisthan: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావీన్స్‌లోని పోలీస్ చెక్ పోస్ట్‌ను లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావీన్స్ (Khyber Pakhtunkhwa province) లోని పోలీస్ చెక్ పోస్ట్(Police check post)ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు పోలీసు సిబ్బంది, ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న ఉత్తర వజీరిస్థాన్ (North Waziristan) గిరిజన జిల్లా మీర్ అలీ తహసీల్‌లోని అస్లాం చెక్ పోస్ట్ (Aslam Check Post) వద్దకు వాహనాలను నడుపుతూ వచ్చిన దుండగులు చెక్ పోస్ట్, భద్రతా దళాల వాహనాలను ఢీకొట్టినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే భారీ పేలుడు సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చేర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. ఈ దాడికి ఇప్పటి ఏ ఉగ్రవాద గ్రూపు కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
ఖైబర్ పఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండీ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో భద్రతా బలగాల త్యాగాలు మరువలేనివని తెలిపారు. టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు. కాగా, ఇటీవల పాకిస్థాన్‌లో తీవ్రవాద కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. ఈ నెలలో ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో జరిగిన ఆపరేషన్లలో దాదాపు డజను మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్థాన్‌లో ఉగ్రవాదం పెరిగింది. ఖైబర్ ఫంఖ్తు్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో అనేక ఉగ్ర ఘటనలు నమోదయ్యాయి.