అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతా విలియమ్స్.. ఆనందంతో డ్యాన్స్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన ఆమె సహచరుడు బుచ్ విల్మోర్‌‌‌లు గురువారం సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.

Update: 2024-06-07 06:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన ఆమె సహచరుడు బుచ్ విల్మోర్‌‌‌లు గురువారం సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక వీరిద్దరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి చేర్చింది. ఈ సందర్భంగా కేంద్రం లోపలికి ప్రవేశించిన వారికి ఘన స్వాగతం లభించింది. అక్కడే ఉన్న మిగతా వ్యోమగాములు వారికి ISS సంప్రదాయం ప్రకారం బెల్ మోగించి స్వాగతం పలికారు. లోపలికి వచ్చిన వెంటనే సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేసి, మిగతా వ్యోమగాములను హత్తుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పెస్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, అది కాస్తా వైరల్ అయింది.

ఈ డ్యాన్స్‌పై స్పందించిన సునీతా, తన సిబ్బందిని "మరొక కుటుంబం" అని పిలుస్తూ, "ఇంత గొప్ప స్వాగతం" ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి ప్రయోగించిన 26 గంటల తర్వాత బోయింగ్ వ్యోమనౌకను అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా డాక్ చేశారు. సునీతా విలియమ్స్ ఇప్పటికే రెండు సార్లు విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 2006లో మొదటిసారి, 2012 రెండో సారి తన సాహస యాత్ర చేశారు. ఆమె 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసి రికార్డు సృష్టించింది.


Similar News