మరింత ఆలస్యం కానున్న సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆమె భూమికి తిరిగి చేరుకోవాల్సి ఉండగా, ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్‌లైనర్‌లో వరుస సాంకేతిక లోపాలు తలెత్తడంతో భూమికి తిరిగి రావడానికి మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్ 5న మరో వ్యోమగామి విల్‌మోర్‌తో కలిసి సునీతా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు జూన్ 14న తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో వారి తిరుగు ప్రయాణం జూన్ 26న ఉండాల్సింది కాగా, వారు ఇంకా భూమికి రాలేదు, దీంతో మరోసారి పర్యటన వాయిదా పడింది. వారు తిరిగి ఎప్పుడు భూమికి వస్తారనే దానిపై నాసా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.
ప్రస్తుతానికి, విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరూ ఇతర ఏడుగురు సిబ్బందితో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నారు. సంబంధిత వర్గాల వారు పేర్కొన్న దాని ప్రకారం, వారు తిరిగి జులై 2న భూమికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అప్పటి వరకు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకపోతేనే ఇది సాధ్యమవుతుందని వారు అన్నారు. ఇదిలా ఉంటే, బోయింగ్ స్టార్‌లైనర్‌లో పలుమార్లు సాంకేతిక సమస్యలు రావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల తయారీ సంస్థ బోయింగ్ లోపాల పరిష్కారంలో అంతగా చర్యలు తీసుకోవడం లేదని, ఇదే విషయంపై నాసా కూడా తమ ఆందోళలను పట్టించుకోలేదని ఇప్పటివరకు 20 మంది విజిల్‌బ్లోయర్లు ఆరోపించారు.