ఆయుధాల సరఫరాను వేగవంతం చేయండి: పాశ్చాత్య దేశాలకు జెలెన్ స్కీ విజ్ఞప్తి
ఈశాన్య ప్రాంతంలో రష్యా దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పాశ్చాత్య దేశాలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, వాయు రక్షణ వ్యవస్థల సరఫరాను వేగవంతం చేయాలని తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య ప్రాంతంలో రష్యా దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పాశ్చాత్య దేశాలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, వాయు రక్షణ వ్యవస్థల సరఫరాను వేగవంతం చేయాలని తెలిపారు. దేశ రాజధాని కీవ్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అనంతరం జెలెన్ స్కీ ప్రసంగించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. ప్యాకేజీల ప్రకటనకు, వాస్తవ ఆయుధాల సరఫరాకు మధ్య చాలా సమయం గడిచి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధాలతోనే రష్యాను ఎదుర్కొగలమని వెల్లడించారు. మరోవైపు ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ..ఉక్రెయిన్‌కు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఉక్రెయిన్ కోసం 60 బిలియన్ల సహాయ ప్యాకేజీని అందించామని, అందులో కొంత సహాయం ఇప్పటికే ఉక్రెయిన్ కు చేరుకుందన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు ఇది సవాల్‌తో కూడిన సమయం అని యూఎస్ గుర్తించిందన్నారు. రష్యా దళాలను ఎదుర్కొనేందుకు యూఎస్ అందించే ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.