Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌కు షాక్: ఆ కేసులో పదేళ్ల జైలు శిక్ష

Update: 2024-01-30 09:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెల 8వ తేదీన పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ తగిలింది. దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో దోషిగా తేలడంతో రావల్పిండిలోని ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక ఇమ్రాన్‌తో పాటు పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అధినేత, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి సైతం పదేళ్ల శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం కోర్టు న్యాయమూర్తి అబువల్ హస్నత్ మహమ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. వాషింగ్టన్‌లోని పాక్ రాయబారి ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వానికి పంపిన రహస్య పత్రంలోని విషయాలను ఇమ్రాన్ ఖాన్ బహిరంగ పర్చారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. గతేడాది నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే రావల్పిండి కోర్టు తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. కాగా, ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటికే తోపాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఆగస్టు 5 2023న ట్రయల్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే గాక మొత్తంగా ఇమ్రాన్ ఖాన్‌పై 15 కేసులు ఉన్నాయి. ఇందులో 9 మే 2022న సైనిక స్థావరాలపై దాడి కేసు కూడా ఉంది. దీని విచారణ సైనిక కోర్టులో జరగనుంది.  

Tags:    

Similar News