పాకిస్తాన్‌లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు

ఇస్లామాబాద్‌లోని డీ చౌక్ లేదా డెమోక్రసీ చౌక్ వద్ద ఆందోళన చేయాలని పీటీఐ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు నేపథ్యంలో ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు.

Update: 2024-10-04 19:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్.. జైలులో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఏ చిన్న నిరసన పిలుపు ఇచ్చినా ప్రభుత్వం వెంటనే దాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ భారీ ఆందోళనకు పిలుపు ఇచ్చింది. దీంతో పాక్ ప్రభుత్వం ఆ ఆందోళనను కట్టడి చేసే పనిలో పడింది. ఇస్లామాబాద్‌లోని డీ చౌక్ లేదా డెమోక్రసీ చౌక్ వద్ద ఆందోళన చేయాలని పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు నేపథ్యంలో ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. దీంతో దేశంలోని చాలా చోట్ల నెటిజన్లు సోషల్ మీడియా యాక్సెస్ చేయలేకపోతున్నారు.

దేశంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయని పీటీఐ ఆరోపిస్తున్నది. షెహెబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నది. న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీశారని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు పీటీఐ పిలుపు ఇచ్చింది. ఈ ఆందోళనల ద్వారా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం ఒత్తిడి పెంచే ఆలోచనలు చేస్తున్నది. పలు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనను విడిపించుకోవాలని పీటీఐ తాపత్రయపడుతున్నది. ఇదే డీ చౌక్‌లో 2014లో ఇమ్రాన్ ఖాన్ 126 రోజులు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు అదే డీ చౌక్ వద్ద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలకు చేపట్టనుంది.

కాగా, ఈ ఆందోళనలను అణచివేసే క్రమంలో భాగంగా ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లో రాజకీయ సభలు, నిరసనలు, ర్యాలీలపై నిషేధం విధించింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. కానీ, పీటీఐ కార్యకర్తలు మాత్రం ఇవేమీ పట్టించుకునేలా లేరు.

Tags:    

Similar News