Nuclear Missiles : అణు క్షిపణుల్ని మోహరిస్తాం.. అమెరికాకు రష్యా వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాకు మరోసారి రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాకు మరోసారి రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 2026 సంవత్సరం నుంచి జర్మనీలో లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్షిపణుల్ని మోహరిస్తామని అమెరికా ప్రకటించడంపై నిప్పులు చెరిగింది. అమెరికా అటువంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటే.. తమ దేశంలోని కాలినిన్‌గ్రాడ్ ప్రాంతంలో అణు క్షిపణుల్ని మోహరిస్తామని రష్యా హెచ్చరించింది. మాస్కోలో మీడియాతో మాట్లాడుతూ.. రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ ఈవిషయాన్ని వెల్లడించారు. కాలినిన్‌గ్రాడ్ ప్రాంతం నాటో కూటమి దేశాలు పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్నందున దాని రక్షణ కోసం తాము ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
రష్యాకు చెందిన చాలా క్షిపణి వ్యవస్థలు అణు వార్‌హెడ్‌లను అమర్చేందుకు అనువుగా ఉంటాయని సెర్గీ ర్యాబ్కోవ్ గుర్తు చేశారు. రష్యాను కవ్వించే విధానాలను విడనాడాలని అమెరికాకు హితవు పలికారు. ‘‘రష్యా లక్ష్యంగా జర్మనీలో అమెరికా మిస్సైల్స్‌ను మోహరిస్తే.. అమెరికాలోని అలస్కా, కాలిఫోర్నియా లక్ష్యంగా క్షిపణులను రష్యా మోహరించే అవకాశం ఉంది. అణు క్షిపణులను మోహరించేందుకు మాస్కో, లెనిన్‌గ్రాడ్, చుకోట్కా, కాలినిన్‌గ్రాడ్ ప్రాంతాలను రష్యా ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి లాంగ్ రేంజ్ మిస్సైళ్లతో అలస్కా, కాలిఫోర్నియాలను టార్గెట్ చేయొచ్చు’’ అని యునైటెడ్ నేషన్స్ నిరాయుధీకరణ పరిశోధనా విభాగం నిపుణుడు ఆండ్రీ బక్లిట్‌స్కీ అంచనా వేశారు.