రష్యా ఎప్పుడూ రూల్స్ ఉల్లంఘించలేదు: భారత విదేశాంగ మంత్రి జైశంకర్
రష్యా-భారత్ సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఎప్పడూ భారత్ ఆసక్తులను ఉల్లంఘించలేదని తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-భారత్ సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఎప్పడూ భారత్ ఆసక్తులను ఉల్లంఘించలేదని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఓ మీడియా చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్నప్పటికీ భారత్‌తో మాత్రం తన ఆర్థిక సంబంధాలను రష్యా మరింత విస్తరించుకుందని చెప్పారు. ‘ప్రతి ఒక్కరూ గత అనుభవాల ఆధారంగా సంబంధాన్ని నిర్వహిస్తారు. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రను గమినిస్తే.. రష్యా ఎప్పుడూ మా ప్రయోజనాలను దెబ్బతీయలేదు. రష్యాతో ఎల్లప్పుడూ మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఇప్పటికీ ఇర దేశాల మధ్య స్థిరమైన సంబంధం ఉంది’ అని వ్యాఖ్యానించారు.
పాశ్చాత్య దేశాల తీరుపై అసంతృప్తి
లడఖ్‌లో చైనాతో సైనిక ప్రతిష్టంభన కారణంగా పాశ్చాత్య దేశాలు భారత్‌కు మద్దతివ్వడం లేదని అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిస్తూ..చైనాతో భారత్‌కు ఉన్న సంబంధాల సూక్ష్మబేధాలను పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకుంటాయని అనుకోవడం లేదన్నారు. కాగా, 2022లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్-రష్యాల సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ భారత్ మాత్రం రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, రష్యా ముడి చమురును కొనుగోలు చేయడానికి భారత్‌కు వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్నారు. ఈ విషయంలో భారత్ వైఖరిని ఆయన పలుమార్లు సమర్థించారు. రష్యా నుంచి ముడి చమురును ఎవరూ కొనుగోలు చేయకపోతే ఇంధన మార్కెట్లో ధరలు మరింత పెరిగేవని స్పష్టం చేశారు.