రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తుది దశకు.. సంకేతం ఇదేనా ?
దిశ, నేషనల్ బ్యూరో : భీకర యుద్ధంలో ఉన్న రష్యా, ఉక్రెయిన్ దేశాలు యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియను వేగవంతం చేశాయి.
దిశ, నేషనల్ బ్యూరో : భీకర యుద్ధంలో ఉన్న రష్యా, ఉక్రెయిన్ దేశాలు యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియను వేగవంతం చేశాయి. మార్పిడి చేసుకునే ఖైదీల సంఖ్యను కూడా పెంచాయి. తాజాగా రష్యాకు చెందిన 195 మంది యుద్ధ ఖైదీలను, ఉక్రెయిన్‌కు చెందిన 207 మంది యుద్ధ ఖైదీలను ఇరుదేశాలు మార్పిడి చేసుకున్నాయి. ‘‘మా దేశానికి చెందిన 207 మంది సైనికులు తిరిగొచ్చారు. వాళ్లందరినీ సురక్షితంగా ఇళ్లకు చేరుస్తాం. వారి భద్రతే మాకు ముఖ్యం’’ అని పేర్కొంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ ప్రకటన విడుదల చేశారు. దాదాపు 65 మంది ఉక్రెయిన్ యుద్ధఖైదీలతో వెళ్తున్న ఒక విమానం రష్యా బార్డర్‌లో ఇటీవల కూలిపోవడంతో.. అందులో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ సైన్యమే ఆ విమానాన్ని కూల్చేసిందని రష్యా ఆర్మీ ఆరోపించింది. అయితే ఆధారాలుంటే ఇవ్వాలని ఉక్రెయిన్ కోరింది. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పుడు పెద్దసంఖ్యలో యుద్ధ ఖైదీల బదిలీని ఇరుదేశాలు మొదలుపెట్టడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు 50 సార్లు ఉక్రెయిన్, రష్యా దేశాలు యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి.