వీటిని కూడా స్మ‌గ్లింగ్ చేస్తారా..?! ఓ అమెరిక‌న్ బ‌ట్ట‌ల్లో 1700 రెప్టైల్స్‌

విలువైన లోహాల‌ను స్మ‌గ్లింగ్ చేయ‌డం వినేవింటాము. Reptiles Smuggling from Mexico to America.

Update: 2022-03-29 08:10 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః విలువైన లోహాల‌ను స్మ‌గ్లింగ్ చేయ‌డం వినేవింటాము. కానీ, పాములు, బ‌ల్లులు, తొండ‌ల వంటి స‌రీసృపాల‌ను అక్ర‌మ ర‌వాణా చేయ‌డం కాస్త విచిత్రంగానే ఉంటుంది. అయినా, వాటిని కూడా స్మ‌గ్లింగ్ చేస్తున్నాడు ఓ అమెరిక‌న్. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 1700 కంటే ఎక్కువ సరీసృపాలను అక్రమంగా రవాణా చేస్తునట్లు అత‌నిపై పోలీసులు అభియోగాలు మోపారు. డజన్ల కొద్దీ బల్లులు, నాలుగు పాములతో సహా దాదాపు 60 రెప్టైల్స్‌ను అతని జాకెట్ జేబుల్లో, ప్యాంటు లోపల దాచిపెట్టుకొని, మెక్సికో నుండి యుఎస్‌లోకి ప్రవేశించాడీ స్మ‌గ్ల‌ర్‌. జోస్ మాన్యువల్ పెరెజ్ అనే ఇత‌గాడు మొదట కస్టమ్స్ అధికారులకు దొరికిన వెంట‌నే ఏమీ లేదని బుకాయించి, త‌ర్వాత అవి త‌న పెంపుడు జంతువుల‌ని అధికారుల‌కు చెప్పాడు. అక్ర‌మంగా త‌రలిస్తున్న 1700 సరీసృపాల మొత్తం విలువ 7,39,000 డాల‌ర్లు పైగా ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

జూలియో రోడ్రిగ్జ్ అని కూడా పిలువబడే జోస్ మాన్యుయెల్ పెరెజ్ స్మగ్లింగ్ చేస్తున్న వాటిలో బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, మొసలి పిల్ల‌లు, మెక్సికన్ పూసల బల్లుల వంటి చాలా జీవులు ఉన్నాయి. వీటిల్లో అంతరించిపోతున్న జాతులే ఎక్కువ‌గా ఉండ‌టం విశేషం. అంతర్జాతీయ వాణిజ్య, ఒప్పందానికి విరుద్ధంగా (CITES) చేస్తున్న‌ అక్ర‌మ‌ర‌వాణాపై కేసులు బ‌నాయించారు. ఆరోపణ ప్రకారం, పెరెజ్ తన సోద‌రి స్టెఫానీ పెరెజ్, సహ-కుట్రదారులతో కలిసి జంతువులను విక్రయించడానికి, పంపిణీ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించారు. సోష‌ల్ మీడియాలో అడవిలో సరీసృపాలు బంధించిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసిన‌ట్లు నివేదించారు. ఇక, ఈ అన్ని ఆరోపణలపై నేరం రుజువైతే, పెరెజ్‌కు ప్రతి స్మగ్లింగ్ కౌంట్‌కు గరిష్టంగా 20 సంవత్సరాలు, ప్రతి వన్యప్రాణుల అక్రమ రవాణా కౌంట్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఈ కేసును యునైటెడ్ స్టేట్స్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ విచారిస్తోంది.

Tags:    

Similar News