బంగ్లాదేశ్‌లో దుర్గాపూజను జరుపుకోవద్దని రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల హెచ్చరిక

బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

Update: 2024-09-27 04:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దుర్గాపూజ సమీపిస్తున్న కొద్దీ బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలను బహిరంగంగా పండుగ జరుపుకోవద్దని, విగ్రహాలకు పూజలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. హిందువులు దుర్గాపూజ వేడుకల కోసం ప్లేగ్రౌండ్‌ను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇన్సాఫ్ కీమ్‌కారీ ఛత్ర-జంటా అనే రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ ఢాకాలోని సెక్టార్ 13లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రాంతంలో చాలా ఏళ్లుగా హిందువులు దుర్గ పూజను నిర్వహిస్తుండగా, ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఆంక్షలు విధించడంతో అక్కడి హిందువులు తాత్కాలిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు.

రోడ్లు మూసివేసి ఎక్కడా కూడా విగ్రహాలను పెట్టవద్దని, పూజలు చేయవద్దని, విగ్రహాం నిమజ్జనం ద్వారా నీటి కాలుష్యం చేయడానికి వీలు లేదని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని ఇస్లామిక్ గ్రూపులు నిరసన చేపట్టాయి. హిందువులు బంగ్లాదేశ్ జనాభాలో 2 శాతం ఉన్నప్పటికి దుర్గాపూజను జాతీయ సెలవుదినంగా మార్చడం రాడికల్ గ్రూపులకు సమస్యగా ఉంది. ఈ పండుగ‌ను నిర్వహించడానికి ముస్లిం మెజారిటీ అంగీకరించడం లేదు. వారు దుర్గాపూజకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

బంగ్లాదేశ్‌లోని అనేక భూములను ఆక్రమించి నిర్మించిన దేవాలయాలను తొలగించాలనే పిలుపు కూడా వారి డిమాండ్‌లలో ఉందని, అలాగే హిందూ పౌరులు బంగ్లాదేశ్ పట్ల తమ విధేయతను, భారత వ్యతిరేకతను నిరూపించుకోవడానికి అన్ని దేవాలయాలలో భారతదేశ వ్యతిరేక బ్యానర్లు, నినాదాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. మరోవైపు అక్కడ దుర్గాపూజను జరుపుకోవడానికి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు 5 లక్షల రూపాయలను డిమాండ్ చేశారని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి.


Similar News