Prigozhin: ప్రిగోజిన్‌ విమానంలో బాంబు.. అమెరికా నిఘా అంచనా

రష్యా ప్రైవేటు ఆర్మీ ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ యెవ్‌గనీ ప్రిగోజిన్‌ మరణంపై అమెరికా నిఘా విభాగాలు అనుమానం వ్యక్తం చేశాయి.

Update: 2023-08-25 10:38 GMT

వాషింగ్టన్ : రష్యా ప్రైవేటు ఆర్మీ ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ యెవ్‌గనీ ప్రిగోజిన్‌ మరణంపై అమెరికా నిఘా విభాగాలు అనుమానం వ్యక్తం చేశాయి. కూలిపోవడానికి ముందే ఆ విమానంలో బాంబు పేలుడు సంభవించి ఉండొచ్చని పెంటగాన్‌ ప్రతినిధి పాట్‌ రైడర్‌ పేర్కొన్నారు. పుతిన్ మనుషులే.. విమానంలో బాంబులను అమర్చారేమోననే సందేహాన్ని వ్యక్తం చేసింది. మిస్సైల్‌తో ప్రిగోజిన్‌ విమానాన్ని కూల్చేశారనే వాదనను ఆయన కొట్టిపారేశారు.

ప్రత్యక్ష సాక్షులు కూడా రెండు పేలుళ్లను విన్నారంటూ ‘గార్డియన్‌’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. మొదటిసారి వచ్చింది విమానంలో బాంబు పేలుడు సౌండ్ అని.. రెండోసారి వచ్చింది విమానం కూలిపోతున్న సౌండ్ అని తెలిపింది. వాగ్నర్‌ గ్రూప్‌కు చెందిన గ్రేజోన్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ సైతం.. యెవ్‌గనీ ప్రిగోజిన్‌ ను హత్య చేసి ఉండొచ్చని ఓ ప్రకటన చేసింది.

కూలిపోయిన ఆ విమానంలో ప్రిగోజిన్‌తో పాటు వాగ్నర్ గ్రూప్ కీలక కమాండర్లు దిమిత్రి ఉత్కిన్‌, వాగ్నర్‌ లాజిస్టిక్స్‌ విభాగం అధిపతి, సిరియాలో గాయపడిన వాగ్నర్‌ సభ్యుడు, బాడీ గార్డ్స్, విమాన సిబ్బంది ఉన్నారు. ‘ప్రిగోజిన్‌, దిమిత్రి ఉత్కిన్‌ లు వాగ్నర్ గ్రూప్ కు రెండు కళ్ల లాంటివారు. వీరిద్దరు ఒకేసారి విమానంలో ఎప్పుడూ ప్రయాణం చేయరు. ఏకకాలంలో ఇలా జరగడం అసాధ్యం.. ఏదో జరిగింది’ అనే అనుమానాన్ని అమెరికా నిఘా విభాగాలు వ్యక్తం చేశాయి.

వీరంతా ఒకే విమానంలో సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌కు ఎందుకు బయల్దేరారన్నది అంతుచిక్కడం లేదని తెలిపాయి. రష్యాకు చెందిన కుంజెంకినో-2 మిలటరీ బేస్‌ సమీపంలోనే ఈ ఘటన జరగడంపై సందేహం వ్యక్తంచేశాయి. ప్రిగోజిన్‌ బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్‌ లెగసీ 600 విమానాన్ని వాడేవాడు. గత 20 ఏళ్లలో ఈ రకం విమానాల్లో జరిగిన రెండో ప్రమాదం ఇది అని ఎంబ్రాయర్‌ విమాన తయారీ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాగ్నర్‌ గ్రూప్ పగ్గాలను ఆండ్రీ ట్రోషేవ్‌ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడు సిరియా ఆపరేషన్స్‌ విభాగానికి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు.


Similar News