చైనాపై నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ..

ఆసియాన్ కూటమి సదస్సు వేదికగా పరోక్షంగా చైనాపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు.

Update: 2023-09-07 13:37 GMT

జకార్తా : ఆసియాన్ కూటమి సదస్సు వేదికగా పరోక్షంగా చైనాపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, సరిహద్దు వివాదాలు ఇప్పుడు పెను సవాలుగా మారాయని, ఈ విషయంలో కూటమిలోని దేశాలకు బలమైన మద్దతు అందిస్తామని ఆయన ప్రకటించారు. భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి ఆసియాన్ సదస్సు మూల స్తంభమని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో గురువారం జరిగిన 20వ ‘ఆసియాన్‌-భారత్‌’ 2023 సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. కూటమిలోని దేశాల సార్వభౌమత్వానికి భంగం కలిగించే బహిర్గత శక్తులను కలిసికట్టుగా ఎదుర్కొనేలా ‘ఆసియాన్’ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

దక్షిణ చైనా సముద్రంలో చైనా సాగిస్తున్న విస్తరణవాదపు ఆగడాల వల్ల ఇబ్బందిపడుతున్న దాదాపు ఐదు దేశాలు ఆసియాన్ కూటమిలో ఉన్న నేపథ్యంలోనే ప్రధాని ఈ కామెంట్స్ చేశారని పరిశీలకులు అంటున్నారు. దీంతోపాటు భారత్-ఆసియాన్ పరస్పర సహకారం కోసం మోడీ 12 ప్రతిపాదనలు చేశారు. మల్టీ మోడల్ కనెక్టివిటీని పెంచడంతో పాటు ఫైనాన్షియల్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, ఈ సదస్సులో మారిటైమ్ కోఆపరేషన్, ఆహార భద్రత తీర్మానాలను ఆమోదించారు. అంతకుముందు జకార్తాకు చేరుకున్న ప్రధాని మోడీకి ఇండోనేషియా సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.


Similar News