Pm modi: బ్రూనై చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన క్రౌన్ ప్రిన్స్
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బ్రూనై చేరుకున్నారు. బందర్ సేరి బెగవాన్ విమానాశ్రయంలో
దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బ్రూనై చేరుకున్నారు. ఆ దేశ రాజధాని బందర్ సేరి బెగవాన్ విమానాశ్రయంలో దిగిన ఆయనకు క్రౌన్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాది బిల్లా ఘన స్వాగతం పలికారు. అనంతరం గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. బెగవాన్‌లోని ఓ హోటల్‌కు వెళ్లగా భారతీయ కమ్యూనిటీ ప్రజలు కూడా వెల్కమ్ చెప్పారు. అనంతరం బ్రూనైలో భారత హైకమిషన్ కొత్త భవనాన్ని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు వారు అందిస్తున్న సహకారాన్ని అభినందించారు.
ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదు సందర్శన
భారత్ హైకమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మోడీ బందర్ సెరి బెగవాన్‌లోని ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. మసీదు చరిత్రకు సంబంధించిన వీడియోను బ్రూనై మత వ్యవహారాల మంత్రి పెహిన్ దాతో ఉస్తాజ్ హాజీ అవాంగ్ బదరుద్దీన్, ఆరోగ్య మంత్రి డాటో డా. హాజీ మొహమ్మద్ ఇషామ్‌లతో కలిసి వీక్షించారు. అంతకుముందు మోడీ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ తనకు స్వాగతం పలికిన ప్రిన్స్ హాజీ అల్ముహతాది బిల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.
పర్యటనలో భాగంగా మోడీ బుధవారం బ్రూనై ప్రధాన మంత్రి హసనాల్ బోల్కియాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతరిక్షం, ఇంధనం వంటి రంగాలలో సహకారంపై డిస్కషన్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. 2024 నాటికి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 40 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా బ్రూనై ప్రధాని ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు.