Pakisthan: పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 23 మంది ప్రయాణికుల కాల్చివేత

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. బస్సులో ప్రయాణిస్తున్న 23 మందిని కాల్చి చంపారు.

Update: 2024-08-26 09:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. బస్సులో ప్రయాణిస్తున్న 23 మందిని కాల్చి చంపారు. బలూచిస్థాన్‌ ప్రావీన్సులోని ముసాఖేల్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..ముసాఖేల్‌ జిల్లాలోని రరాషమ్ అంతర్-ప్రాంతీయ రహదారిని ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ బస్సును ఆపారు. ప్రయాణికులను కిందకు దింపి వారి ఐడీలను తనిఖీ చేశారు. అనంతరం ప్రయాణికులపై విచాక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే 23 మంది మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా పంజాబ్‌కు చెందిన వారేనని తెలిపారు. అందులో ఇద్దరు పారామిలిటరీ సైనికులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం ముష్కరులు మరో 10 వాహనాలకు నిప్పు పెట్టారు.

ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. అయితే ఈ ప్రాంతంలో మిలిటెంట్ వేర్పాటువాద గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అత్యంత చురుకుగా పని చేస్తుందని, ఈ దాడి ఆ సంస్థ పనే అయి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్‌కు చెందిన వ్యక్తులను గుర్తించి మరీ కాల్చివేసినట్టు సమాచారం. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్య 30 నుంచి 40గా ఉంటుందని సమాచారం. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లోరూ ఇదే తరహా దాడి జరిగింది. బలూచిస్థాన్‌లోని నుష్కీ సమీపంలో ఐడీ కార్డులను తనిఖీ చేసి 9 మందిని టెర్రరిస్టులు కాల్చిచంపారు.

విచారణకు ఆదేశించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఈ ఘటనపై పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. ఇదొక అనాగరిక చర్య అని అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందేలా చూడాలని ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆర్డర్స్ జారీ చేశారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని, ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించబోమని హెచ్చరించారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తీవ్రవాద చర్యను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News