లాహోర్ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది: అంగీకరించిన నవాజ్ షరీఫ్
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని తమ దేశం ఉల్లంఘించిందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని తమ దేశం ఉల్లంఘించిందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. తన పార్టీ పీఎంఎల్-ఎన్ సమావేశం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నవాజ్ మాట్లాడారు. ‘1998 మే 28న పాకిస్థాన్ ఐదు అణుపరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వాజ్‌పేయి ఇక్కడికి వచ్చి మాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాం. అది మా తప్పే’ అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన తర్వాత పీఎంఎల్-ఎన్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
‘పాకిస్థాన్‌ను అణు పరీక్షలు చేయకుండా ఆపేందుకు బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేశారు. కానీ నేను దానికి నిరాకరించాను. ఒక వేళ ఇమ్రాన్ ఖాన్ నా సీటులో ఉన్నట్లయితే, అతను క్లింటన్ ఆఫర్‌ను అంగీకరించి ఉండేవాడు’ అని చెప్పారు. 2017లో అప్పటి పాక్ ప్రధాన న్యాయమూర్తి సాకిబ్ నిసార్ తప్పుడు కేసుతో తనను ప్రధాని కార్యాలయం నుంచి తొలగించారని చెప్పారు. తనపై ఉన్న కేసులన్నీ అవాస్తవమని, ఇమ్రాన్ ఖాన్‌పై ఉన్న కేసులు నిజమని అన్నారు.
కాగా, 1999 ఫిబ్రవరి 21న లాహోర్ అగ్రిమెంట్ జరిగింది. ఇది భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం. దీని ప్రకారం.. అణు ఆయుధాల అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రమాదవశాత్తు లేదా అనధికారికంగా వాటిని వినియోగాన్ని నివారించడం వంటి అంశాలు ప్రధానమైనవి. దీనిపై అప్పటి పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిలు సంతకం చేశారు. అయితే, కొన్ని నెలల తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో పాకిస్థాన్ దళాలు చొరబడేందుకు ప్రయత్నించాయి. దీంతో ఇరు దేశాల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది.