India-Pak: ప్రధాని మోడీని తమ దేశానికి ఆహ్వానించిన పాక్

భారత ప్రధాని మోడీని పాకిస్తాన్ తమ దేశానికి ఆహ్వానించింది

Update: 2024-08-25 07:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని మోడీని పాకిస్తాన్ తమ దేశానికి ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగబోయే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ) సమావేశానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ)కు చెందిన ఇతర నేతలతో పాటు ఇస్లామాబాద్‌ను సందర్శించాలని మోడీకి ఆహ్వానం పంపించింది. అయితే మోడీ ఈ సమావేశానికి వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాద దాడులు, ఆర్టికల్ 370 రద్దుపై పాక్ విమర్శల కారణంగా ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మోడీ అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.

అయితే ఆయనకు బదులుగా, భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి విదేశాంగ మంత్రి జైశంకర్‌ను పంపే అవకాశం ఉందని సమాచారం. గత సంవత్సరం బిష్కెక్‌లో జరిగిన సీహెచ్‌జీ సమావేశాలకు భారతదేశం దేశం తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. కానీ ఈసారి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఏ వివరాలు చెప్పలేమని అధికారులు తెలిపారు.

ఈవెంట్‌కు వ్యక్తిగతంగా హాజరుకాలేని నాయకులు వర్చువల్‌గా పాల్గొనేందుకు అనుమతిస్తారా లేదా అనేది అనిశ్చితంగానే ఉంది. ప్రస్తుతం కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్‌కు అధ్యక్షత వహిస్తున్న పాకిస్తాన్ అక్టోబర్ 15-16 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించనుంది. ఎస్‌సీఓలో భారతదేశం, పాకిస్తాన్, రష్యా, చైనా సభ్యులుగా ఉన్నాయి.


Similar News