Pakistan : భారీ వర్షాలతో పాకిస్తాన్ అతలాకుతలం..నిరాశ్రయులైన వేల మంది ప్రజలు

పాకిస్తాన్ ను వరదలు ముంచెత్తాయి .

Update: 2024-08-25 00:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ ను వరదలు ముంచెత్తాయి . బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 22 మంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారని పాకిస్థాన్‌కు చెందిన ప్రాంతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (PDMA) వెల్లడించింది. PDMA నివేదిక ప్రకారం గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల 5,448 మంది ప్రజలు వరద ముంపుకు గురయ్యారు. వరదల కారణంగా దాదాపు 158 నివాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అలాగే 622 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.అదనంగా, 102 ఎకరాల పంటల నష్టం వాటిల్లింది. 35 కిలోమీటర్ల రోడ్లు కూడా ఆకస్మిక వరదలకు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా ఏడు వంతెనలు దెబ్బతిన్నాయని, 131 పశువులు చనిపోయాయని పీడీఎంఏ నివేదిక పేర్కొంది.

పాకిస్తాన్ వాతావరణ విభాగం (PMD) నిపుణుడు సర్దార్ సర్ఫ్రాజ్ మాట్లాడూతూ.. ఆగస్టు 26-30 మధ్యలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని,ముఖ్యంగా బలూచిస్తాన్, సింధ్, పంజాబ్‌ ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందని, ఈ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రుతుపవనాల చురుగ్గా కదులుతునందున ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని ,దీంతో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని సర్దార్ సర్ఫ్రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆగస్ట్ 25 నుంచి 29 వరకు దక్షిణ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని పాకిస్థాన్ వాతావరణ శాఖ (పీఎండీ) అంచనా వేసింది.


Similar News