భారత్‌తో యుద్దం గురించి పాక్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కశ్మీర్ సమస్య వంటి అంశాలపై నిజాయితీగా చర్చలకు పిలుపునిచ్చారు. భారత్‌తో గత 3 యుద్దాల్లో గుణపాఠం నేర్చుకున్నామని దుబాయ్‌కి చెందిన టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పొరుగు దేశంతో శాంతి కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 'ప్రధాని మోడీ ఇరు దేశాల మధ్య ఉన్న కశ్మీర్ వంటి దీర్ఘకాల సమస్యలపై చర్చకు రావాలని కోరుతున్నాను. అయితే శాంతియుతంగా జీవించడం, పురోగతి సాధించడం లేదా ఒకరితో ఒకరు గొడవ పడుతూ వనరులను వృథా చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది' అని అన్నారు.
భారత్‌తో మూడు యుద్ధాలు చేశామని.. దీని ద్వారా ప్రజలకు పేదరికం, నిరుద్యోగం, మరిన్ని కష్టాలు వచ్చాయని చెప్పారు. ఈ యుద్ధాల ద్వారా నేర్చుకున్న గుణపాఠం ఏమిటంటే భారత్‌తో శాంతియుతంగా జీవించాలని మేము కోరుకుంటాన్నమని తెలిపారు. నిజమైన సమస్యలను పరిష్కరించడం ద్వారానే ఇది సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఇరు దేశాల వనరులను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ ఆయుధాలు, పేలుడు సామాగ్రితో సమయాన్ని వృథా చేయట్లేదని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ప్రతిసారి భారత్ పాకిస్తాన్‌కు కౌంటర్ ఇస్తూనే ఉంది.
మరోవైపు తాజాగా షరీఫ్ చేసిన శాంతి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక కుంగుబాటు, పాలకులపై ప్రజల వ్యతిరేకత వంటి అంశాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. సంక్షోభ పరిస్థితులు, ధరల పెరుగుదల ఆ దేశాన్ని వెనక్కి నెడుతున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో తెహ్రీక్ ఈ తాలిబన్(టీటీపీ)తో ప్రమాదం పొంచి ఉంది.
ఇవి కూడా చదవండి : సిబ్బందికి బ్రిటన్ ప్రధాని సంక్రాంతి విందు (వీడియో)