పాక్‌‌లో ‘పీఠ’ముడి.. ఇమ్రాన్, నవాజ్ ‘సంకీర్ణ’ సమరం

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌ రాజకీయాల్లో కింగ్‌గా అవతరించేది ఎవరు ? కింగ్ మేకర్ అయ్యేది ఎవరు ?

Update: 2024-02-10 17:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌ రాజకీయాల్లో కింగ్‌గా అవతరించేది ఎవరు ? కింగ్ మేకర్ అయ్యేది ఎవరు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాధారణంగానైతే శనివారం ఉదయం నాటికే మొత్తం ఫలితాలు వెలువడాలి. కానీ పాక్ ఎన్నికల సంఘం శనివారం రాత్రి వరకు కూడా మొత్తం స్థానాలకు సంబంధించిన రిజల్ట్‌ను రిలీజ్ చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేేసిన ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఎన్నికల సంఘం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కడపటి సమాచారం అందే సమయానికి పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగిన మొత్తం 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకుగానూ 255 స్థానాల ఫలితాలు వచ్చాయి. 101 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన ఇమ్రాన్ ఖాన్ అనుచరులు గెలిచారు. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 73 స్థానాల్లో, ఆసిఫ్ అలీ జర్దారీ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 స్థానాల్లో గెలిచాయి. పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు 133 సీట్ల బలం అవసరం. సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు సంబంధించిన డీల్‌పై చర్చించేందుకు నవాజ్ షరీఫ్, ఆసిఫ్ అలీ జర్దారీ భుట్టో లాహోర్‌లో భేటీ అయ్యారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇమ్రాన్ ఖాన్ అనుచరులు దాదాపు 101 మంది.. ముత్తాహిదా ఖవ్మీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) పార్టీకి చెందిన 17 మంది సభ్యులు, ఇతరత్రా స్వతంత్రులతో కలిసి సర్కారును ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పాక్‌లో ఏర్పడేది సంకీర్ణ సర్కారే అని తేలిపోయింది. ఆదివారం మధ్యాహ్నంకల్లా ఈ పొలిటికల్ సస్పెన్స్ వీడుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News