దక్షిణ కొరియా వైపు చెత్తతో నిండిన 600 బెలూన్లను పంపిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా నుంచి చెత్తతో కూడిన బెలూన్లు దక్షిణ కొరియా గ్రామాల్లో పడుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-06-02 07:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా నుంచి చెత్తతో కూడిన బెలూన్లు దక్షిణ కొరియా గ్రామాల్లో పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా బెలూన్ల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు దాదాపు 600 కు పైగా చెత్తతో కూడిన బెలూన్లు ఉత్తర కొరియా సరిహద్దు గ్రామాల నుంచి దక్షిణ కొరియా వైపుగా గాల్లో ఎగిరినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. క్రింద పడిన తరువాత బెలూన్లకు కట్టి ఉన్న కవర్‌లను ఓపెన్ చేయగా వాటిలో సిగరెట్ పీకలు, స్క్రాప్‌లు, వ్యర్థ కాగితం, వినైల్ ఉన్నాయి, అయితే ఎటువంటి ప్రమాదకరమైన పదార్థాలు మాత్రం లేవని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆదివారం తెలిపారు.

గాల్లో నుంచి ఏదైనా పడినట్లయితే ఆ వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలని, ఉత్తర కొరియాకు చెందినవిగా అనుమానిస్తున్న వస్తువులను తాకవద్దని, బదులుగా వాటిని మిలిటరీ లేదా పోలీసు కార్యాలయాలకు నివేదించాలని సైన్యం ప్రజలకు సూచించింది. ఈ బెలూన్ల కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరిగినట్లు సమాచారం లేదు. సియోల్‌లో నగరానికి సమీపంలోని ఆకాశంలో ఉత్తర కొరియా నుండి ఎగురుతున్నట్లు అనుమానించబడిన గుర్తు తెలియని వస్తువులు కనుగొన్నామని, సైన్యం వాటికి ప్రతిస్పందిస్తోందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ఇంతకుముందు మంగళవారం రాత్రి నుండి బుధవారం వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 260 ఉత్తర కొరియా బెలూన్‌లను కనిపెట్టారు. ప్రస్తుతం అవి నేలపై పడిపోవడంతో వాటిని క్లియర్ చేయడానికి దక్షిణ కొరియా సైన్యం, స్థానిక అధికారులు శ్రమిస్తున్నారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉన్నాయో కనిపెట్టడానికి బాంబ్ స్క్వాడ్ బృందాలను పంపారు. బెలూన్లకు కట్టిన కవర్‌లో ఎక్కువగా వివిధ రకాల చెత్త, పేడను ఉన్నాయి, అయితే రసాయన, జీవ లేదా రేడియోధార్మిక పదార్థాలు వంటి ప్రమాదకరమైన పదార్థాలు లేవని మిలిటరీ తెలిపింది.


Similar News