దక్షిణ కొరియాకు చెత్తతో కూడిన 150 బెలూన్లను పంపిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా- దక్షిణ కొరియాల మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-29 11:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా- దక్షిణ కొరియాల మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల సరిహద్దుల్లో బెలూన్లు కారణంగా గత కొన్నేళ్లుగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఉత్తర కొరియా చెత్త, విసర్జనతో కూడిన వస్తువులను తీసుకెళ్లే బెలూన్లను దక్షిణ కొరియా వైపు పంపిందని ఆ దేశ సైన్యం తెలిపింది. చెత్త, మలంతో కూడిన 150 బెలూన్లను దక్షిణ కొరియాలో పడేలా ఎగురవేశారని, మరికొన్ని ఇప్పటికీ గాల్లోనే ఉన్నాయని సైన్యం పేర్కొంది. చెత్త, మలంతో పాటు పేలుడు పదార్ధాలను సైతం బెలూన్ల ద్వారా పంపించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.


ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏవైనా బెలూన్లు కనిపించినట్లయితే అధికారులకు సమాచారం అందించాలని అలాగే, ఇంటి పరిసరాల్లో లేదా ఇతర స్థలాల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లయితే వాటిని తాకవద్దని సైనికులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని దక్షిణ కొరియా అధికారులు అక్కడ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు సూచించారు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో బెలూన్ల తాలూకు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దానిలో కనిపించిన దాని ప్రకారం, బెలూన్‌లకు ప్లాస్టిక్ బ్యాగ్‌లు కట్టి ఉన్నట్లు కనిపించింది. ఆ బ్యాగుల్లో టాయిలెట్ పేపర్, మానవ విసర్జనను పోలి ఉండే ముదురు మట్టి, బ్యాటరీలు వంటి వస్తువులi ఉన్నాయని అక్కడి వార్త సంస్థ ధృవీకరించింది.

దక్షిణ కొరియా సైన్యం ఈ చర్యను "అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడం" అని ఖండించింది, ఇది ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పుగా ప్రకటించింది. బెలూన్‌ల కారణంగా జరిగే పరిణామాలకు ఉత్తర కొరియా పూర్తిగా బాధ్యత వహిస్తుంది, ఈ అమానవీయ, క్రూరమైన చర్యను వెంటనే ఆపాలని ఉత్తర కొరియాను గట్టిగా హెచ్చరిస్తుంది. గతంలో కరపత్రాలను పంచడానికి ఈ విధంగా బెలూన్లను ఎగురవేసేవారు. కానీ ఇప్పుడు చెత్తను పంపడానికి ఈ విధంగా చేస్తున్నారు.


Similar News