North Korea : యుద్ధానికి రెడీ కండి.. ఆర్మీకి ఆదేశాలు జారీ!
శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని, ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైన్యాన్ని ఆదేశించారు.
ప్యాంగ్యాంగ్: శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని, ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైన్యాన్ని ఆదేశించారు. గురువారం జరిగిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం సైనిక జనరల్‌గా ఉన్న పాక్-సు-ఇల్ స్థానంలో కొత్త జనరల్‌గా రి యాంగ్ గిల్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఆగస్టు 21 నుంచి 24 వరకు అమెరికా, దక్షిణ కొరియా చేపట్టబోయే సంయుక్త సైనిక విన్యాసాలపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ దేశ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది. ఆ సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియాలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని ఆర్డర్స్ ఇచ్చారని తెలిపింది.
గతవారం దేశంలోని ఆయుధ కర్మాగారాలను సందర్శించిన కిమ్.. క్రూయిజ్ క్షిపణుల ఇంజిన్లు, మానవరహిత గగనతల వాహనాల (యూఏవీ)ల తయారీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను కూడా పరిశీలించారు. మరోవైపు ఉక్రెయిన్‌పై దాడి కోసం రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణలను రష్యా, ఉత్తర కొరియాలు కొట్టిపారేశాయి.