నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు జైలుశిక్ష.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను తీవ్రంగా విమర్శించే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్‌కు ఆ దేశంలోని ఒక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను తీవ్రంగా విమర్శించే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్‌కు ఆ దేశంలోని ఒక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మహమ్మద్ యూనస్ మరో ముగ్గురితో కలిసి గ్రామీణ్ టెలికామ్ అనే సంస్థను స్థాపించారు. ఆయన ఇలాంటివి మొత్తం మూడు కంపెనీలు ఏర్పాటు చేశారు. అయితే గ్రామీణ్ టెలికామ్ సంస్థ తన కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం యూనస్, ఆయన సహచరులు ముగ్గురిని దోషులుగా తేల్చి ఈమేరకు శిక్ష విధించింది. అయితే తాము ఏ తప్పూ చేయలేదని వారు వాదించారు. దీంతో పైకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి వారికి బెయిల్ మంజూరైంది.
శిక్షపై యూనస్ సంచలన కామెంట్
“మా లాయర్లు న్యాయబద్ధంగా ఈ కేసు వాదించారు. కానీ, ఎలాంటి హేతుబద్ధత లేకుండా, చట్టపరమైన విధానాలను పాటించకుండా కోర్టు వ్యవహరించింది” అని ప్రొఫెసర్ యూనస్ కామెంట్ చేశారు. 83 ఏళ్ల యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షలాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారనే ఘనతను సాధించారు. అయితే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వాదన మరోలా ఉంది. పేదల రక్తాన్ని వడ్డీల రూపంలో మహమ్మద్ యూనస్ పీలుస్తున్నారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.