భారతదేశ భద్రతకు ఎవరూ హాని చేయలేరు: శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ

శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్, శ్రీలంకల మధ్య ఎంతో అద్భుతమైన సంబంధాలున్నాయని తెలిపారు.

Update: 2024-05-21 13:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్, శ్రీలంకల మధ్య ఎంతో అద్భుతమైన సంబంధాలున్నాయని తెలిపారు. భారతదేశ భద్రతా ప్రయోజనాలకు ఎవరూ హాని కలిగించబోరని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో పోర్టులు, పునరుత్పాదక ఇంధనం, ఇతర మౌలిక సదుపాయాలపై శ్రీలంక చాలా పెట్టుబడులు పెట్టాలని చూస్తోందని వెల్లడించారు. ‘రెండు దేశాల మధ్య బహుముఖ భాగస్వామ్యం ఉంది. ఆర్థికంగా ఉమ్మడి ప్రయోజనం కోసం ఒకరితో ఒకరు నిమగ్నమవ్వడానికి ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు. శ్రీలంకను సందర్శించడానికి భారతీయులకు మరిన్ని అవకాశాలను అందుబాటులోకి తెస్తామన్నారు.

‘శ్రీలంకలోని అన్ని కమ్యూనిటీలు బౌద్ధులు, సింహళులు, తమిళులు, ముస్లింలు, అందరూ భారతీయ నాగరికతచే ప్రభావితమయ్యారు. కాబట్టి భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. భారతదేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను పరిరక్షించడంలో శ్రీలంక ముందుంటుందని, భారత భద్రతకు ఆటంకం కలిగించడానికి ఎవరినీ అనుమతించబోమని నొక్కి చెప్పారు. శ్రీలంక అన్ని దేశాలతో కలిసి పని చేయాలనుకుంటుందని స్పష్టం చేశారు.

బ్రిక్స్‌లో చేరేందుకు ఆసక్తి

అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసం ఏర్పడిన బ్రిక్స్ కూటమిలో చేరడానికి శ్రీలంక ఆసక్తిగా ఉన్నట్టు అలీ సబ్రీ తెలిపారు. బ్రిక్స్ గ్రూపులో చేరేందుకు అధికారికంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు శ్రీలంక ముందుగా భారత్‌ను సంప్రదిస్తుందని చెప్పారు. బ్రిక్స్ మంచి కూటమిగా ఉందని చెప్పారు. ఈ ప్రతిపాదనపై భారత్ తమకు మద్దతివ్వాలని కోరారు. రష్యాలో జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి తనను ఆహ్వానించినట్టు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరిలో రష్యా బ్రిక్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటీవలే బ్రిక్స్‌లో కొత్త పూర్తి సభ్యులుగా చేరాయి. 

Tags:    

Similar News