మాస్కోపై ఉగ్రదాడి : వీల్ ఛైర్‌లో కోర్టుకు నలుగురు ఉగ్రవాదులు

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా రాజధాని మాస్కోలో ఉన్న క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌పై దాడి చేసి 150 మందిని పొట్టనపెట్టుకున్న నలుగురు ఉగ్రవాదులపై న్యాయ విచారణ మొదలైంది.

Update: 2024-03-25 15:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా రాజధాని మాస్కోలో ఉన్న క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌పై దాడి చేసి 150 మందిని పొట్టనపెట్టుకున్న నలుగురు ఉగ్రవాదులపై న్యాయ విచారణ మొదలైంది. ఆ నలుగురు ఉగ్రమూకలను వీల్ ఛైర్‌లో సోమవారం మాస్కోలోని బాస్‌మన్నీ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. వారిపై రష్యా ప్రభుత్వం తీవ్రవాద చర్యకు సంబంధించిన అభియోగాలను మోపింది. రష్యా భద్రతా బలగాలు సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలించిన కోర్టు.. వారిని మే 22 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు దలెర్డ్‌జోన్ మిర్జోయెవ్, సైదాక్రమి మురోదలీ రచబలిజోడా, షంసిదిన్ ఫరీదుని, ముహమ్మద్సోబిర్ ఫైజోవ్‌ అనే పేర్లు కలిగిన నలుగురు ఉగ్రవాదులను భారీ భద్రత నడుమ కోర్టులోకి తీసుకొచ్చారు. ఈసమయంలో అక్కడున్న మీడియా ప్రతినిధులు ఉగ్రవాదుల ఫొటోలను కెమెరాలో బంధించేందుకు పోటీపడ్డారు. ఉగ్రవాదులందరి మొహాలపై తీవ్ర గాయాలు కనిపించాయి. ఓ ఉగ్రవాది చెవికి కట్లు కట్టి ఉన్నాయి. మరో ఉగ్రవాది ఫైజోవ్ కనీసం కళ్లు తెరిచి చూడలేని బలహీన స్థితిలో వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు. ఇంకో ఉగ్రవాది మెడకు చిరిగిన ప్లాస్టిక్ సంచి చుట్టి ఉంది. ఫరీదుని అనే టెర్రరిస్ట్ మొహం బాగా ఉబ్బింది. దీన్నిబట్టి వారిని ఏ రేంజులో రష్యా దర్యాప్తు సంస్థలు ఇంటరాగేషన్ చేసి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రదాడికి సంబంధించిన నిజాలను రాబట్టేందుకు వీరికి విద్యుత్ షాక్‌ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులంతా తజకిస్థాన్ పౌరులని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి రష్యాలో మరణశిక్ష అమల్లో లేదు. 150 మందిని బలిగొన్న ఉగ్రవాదుల విషయంలో ఆ నిబంధన అమలు కాకుండా చూడాలనే డిమాండ్ రష్యాలో వెల్లువెత్తుతోంది.

Tags:    

Similar News