భారత ప్రధానికి ఫోన్ చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ భారత ప్రధానికి ఫోన్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ భారత ప్రధానికి ఫోన్ చేశారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల విషయంలో గొడవలు చెలరేగి అవి దేశాన్ని అత్యవసర పరిస్థితిలోకి నెట్టేశాయి. బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయాక ఆ దేశంలో హింస మరింత చెలరేగింది. ఈ గొడవల్లో అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న అనేక వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. బంగ్లాకు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనస్ స్వయంగా అక్కడి ప్రజలకు ముస్లింలు, హిందువులు, బౌద్ధులు అంతా సమానమే.. అందరినీ సోదర సోదరులలాగే భావించండి అని రిక్వెస్ట్ చేసినా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులపై భారత్ లో సర్వత్రా ఆందోళన మొదలైన నేపథ్యంలో.. స్వయంగా మహమ్మద్ యూనస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో హిందువులను, మైనార్టీలను సంరక్షిస్తామని, వారి పూర్తి భాద్యత మాదే అని యూనస్ ప్రధానికి హామీ ఇచ్చినట్టు సమాచారం.