భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు..కారణమిదే?
భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాల్దీవులకు అవసరమైన సామగ్రిని ఎగుమతి చేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు మాల్దీవులు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాల్దీవులకు అవసరమైన సామగ్రిని ఎగుమతి చేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు మాల్దీవులు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీశ్ శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘మాల్దీవులకు సామగ్రిని అందజేయాలని భారత్ తీసుకున్న డిసిషన్ సంతోషకరం. అందుకు గాను విదేశాంగ మంత్రి జైశంకర్. భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని సూచిస్తుంది. అంతేగాక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి బలమైన సూచనలు ఇస్తుంది’ అని పేర్కొన్నారు. మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు, భారత ప్రభుత్వం అవసరమైన వస్తువులను ఎగుమతి చేయడానికి అనుమతించింది. గుడ్లు, బంగాళా దుంపలు, ఉల్లిపాయలు, చక్కెర, బియ్యం, గోధుమ పిండి, పప్పులు వంటివి భారత్ మాల్దీవులకు ఎగుమతి చేయనుంది. కాగా, భారత సైనిక దళాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్లు, ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామగ్రి ఒప్పందం జరగడం గమనార్హం.