ఇజ్రాయెల్ పౌరులపై మాల్దీవులు నిషేధం: పాలస్తీనాకు సంఘీభావం

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మాల్దీవుల ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్ పౌరులు మాల్దీవులలోని ప్రవేశించకుండా నిషేధం విధించాలని

Update: 2024-06-03 03:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మాల్దీవుల ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్ పౌరులు మాల్దీవులలోని ప్రవేశించకుండా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో పాస్‌పోర్ట్ నిబంధనలు మార్చడం ద్వారా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్‌లను నిషేధించించనున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేబినెట్ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో దేశంలోని సీనియర్ అధికారులు ఉన్నారు

అంతేగాక పాలస్తీనా అవసరాలను గుర్తించడానికి ప్రత్యేక రాయబారిని కూడా నియమించింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ సహాయంతో పాలస్తీనా పౌరులకు సహాయం చేయడానికి నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. పాలస్తీనా పౌరులకు మద్దతు తెలిపేందుకు ‘మాల్వీవియన్స్ ఇన్ సోలిడారిటీ విత్ పాలస్తీన్’ అనే నినాదంతో దేశ వ్యాప్త ర్యాలీని కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ మీటింగ్ తర్వాత దేశ హోంల్యాండ్ సెక్యూరిటీ, టెక్నాలజీ మంత్రి అలీ ఇహుసన్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కాగా, గాజాలో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా మాల్దీవులలో ప్రజలు నిరసనలు చేస్తున్నారు. రఫా నగరంలో దాడులను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ పౌరుల ప్రవేశాన్ని కూడా నిషేధించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా సుమారు 15వేల మంది ఇజ్రాయెల్ పౌరులు మాల్దీవులను సందర్శిస్తారని తెలుస్తోంది.


Similar News