అమాయకుల ప్రాణాలు కోల్పోవడం విషాదమే: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పవడం విషాదకరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. యుద్ధంలో మరణించిన మృతుల కుటుంబాలనకు సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పవడం విషాదకరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. యుద్ధంలో మరణించిన మృతుల కుటుంబాలనకు సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడించారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో భేటీ అనంతరం బైడెన్ మాట్లాడారు. గత నాలుగు నెలల్లో పాలస్తీనా ప్రజలు అధిక నష్టాన్ని చవి చూశారని చెప్పారు. అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయని..తమ బందువులతో సహా అందరినీ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మిలియన్ల మంది జనాభా ఉండే రఫా నగరంపై దాడి చేయొద్దని మరోసారి పునరుద్ఘాటించారు. హమాస్ చేతిలో ఉన్న అదనపు బందీలను విడుదల చేయడం కోసం పోరాటంలో ఆరు వారాల విరామం ఇచ్చే విషయాన్ని పరిగణించాలన్నారు. ఈ ఒప్పందానికి వీలైనంతగా యూఎస్ సహకరిస్తుందని స్పష్టం చేశారు. దీని ద్వారా గాజాలో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఈజిప్టు నాయకులతోనూ మాట్లాడినట్టు చెప్పారు.
రఫాపై ఇజ్రాయెల్ దాడి చేయొద్దు: జోర్డాన్ రాజు
జోర్డాన్ రాజు అబ్దుల్లా II మాట్లాడుతూ..శాశ్వత కాల్పుల విరమణ కోరుకుంటున్నట్టు తెలిపారు. ఘర్షణను పరిష్కరించడంలో బైడెన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. మానవతా విపత్తును నివారించడానికి వెంటనే చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు. గాజాపై హమాస్ నియంత్రణను నిలుపుకోకుండా ఉండాలని స్పష్టం చేశారు. రఫా నగరంపై ఇజ్రాయెల్ డాది చేయొద్దని తెలిపారు. కాగా, యుద్ధం ప్రారంభం రోజున 240 మందిని హమాస్ బంధీలుగా చేసుకోగా అందులో 100మంది నవంబర్ లో కాల్పుల విరమణ టైంలో విడుదల చేయబడ్డారు. అయితే ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం హమాస్ వద్ద ఇంకా 130 మంది బంధీలుగా ఉన్నారని తెలుస్తోంది.