తైవాన్ అధ్యక్షుడిగా లైచింగ్-తే ప్రమాణ స్వీకారం: చైనాకు కీలక సూచన
తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్-తే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సెంట్రల్ తైపీలోని జపనీస్-కలోనియల్ ఎరా అధ్యక్ష కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్-తే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సెంట్రల్ తైపీలోని జపనీస్-కలోనియల్ ఎరా అధ్యక్ష కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్, నూతన వైస్ ప్రెసిడెంట్ హ్సియావో బి-ఖిమ్ వేవ్‌లు కూడా హాజరయ్యారు. ఇటీవల జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ విజయం సాధించింది. తైవాన్ మాజీ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ గతంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షురాలిగా పని చేశారు. అయితే ఆమె మరోసారి పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో లైచింగ్ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలోనే ఆయన బాధ్యతలు చేపట్టారు.
గత నాలుగు సంవత్సరాలుగా త్సాయ్ ఇంగ్-వెన్ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన లైచింగ్ తే ను చైనా ప్రమాదకర వేర్పాటు వాదిగా అభివర్ణించింది. లైచింగ్ తన ప్రారంభతోత్సవ ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ..చైనా సైనిక బెదిరింపులను ఇప్పటికైనా ఆపాలని తెలిపారు. శాంతి మార్గం ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచాన్ని యుద్ధభయం లేకుండా చూసేందుకు, శాంతిని నిర్ధారించడానికి చైనా తైవాన్‌తో సంయుక్తంగా బాధ్యత వహించాలన్నారు. తైవాన్ ప్రజలు మాత్రమే తమ భవిష్యత్తును నిర్ణయించగలరని అభిప్రాయపడ్డారు.
కాగా, తైవాన్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో లైచింగ్ తే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. అమెరికాతో తైవాన్ సన్నిహితంగా ఉండటంతో ఇప్పటికే చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో లై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. లై తైవాన్ ఎనిమిదో అధ్యక్షుడు కావడం గమనార్హం.