మరోసారి కిమ్ కవ్వింపు చర్యలు: జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు ఆపడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్..

Update: 2024-04-02 03:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు ఆపడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్..తాజాగా మంగళవారం జపాన్ సముద్రం మీదుగా మరో మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ‘కొత్త-రకం ఇంటర్మీడియట్-రేంజ్ హైపర్ సోనిక్ క్షిపణి’ కోసం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఇటీవల ఇంజన్ పరీక్షను పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలోనే మిస్సైల్ ప్రయోగించడం కలకలం రేపింది. తాజా ప్రయోగాన్ని జపాన్ సైతం ధ్రువీకరించింది. జపాన్ ప్రత్యేక ఆర్థిక జోన్ వెలుపల ఉన్న నీటిలో క్షిపణి పడిపోయినట్టు భావిస్తోంది. ఓడలు అప్రమత్తంగా ఉండాలని, పడిపోయిన వస్తువులను వాటి దగ్గరకు రాకుండా చూడాలని ఆదేశ కోస్ట్‌గార్డ్ సూచించింది.

ఈ ఘటనపై జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా కూడా స్పందించారు. ‘ఉత్తరకొరియా పదేపదే బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. దీని ద్వారా ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’ అని తెలిపారు. ఇటీవల రష్యా, ఉత్తరకొరియాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్షిపణి ప్రయోగం జరగడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజా ప్రయోగంపై ఉత్తరకొరియా అధికారికంగా స్పందిచలేదు. అయితే దక్షిణ కొరియాను తన ప్రధాన శత్రువుగా కిమ్ ప్రకటించారు.

Tags:    

Similar News