ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌పై ఎన్ఐఏ కేసు
కెనడాలో ఉంటున్న ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఆస్తులను ఇప్పటికే జప్తు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ).. ఇప్పుడు అతడిపై మరో కేసు నమోదు చేసింది.
న్యూఢిల్లీ: కెనడాలో ఉంటున్న ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఆస్తులను ఇప్పటికే జప్తు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ).. ఇప్పుడు అతడిపై మరో కేసు నమోదు చేసింది. ‘‘భారత్‌లోని సిక్కులెవరూ నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దు. ఒకవేళ ప్రయాణిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఆ రోజున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడుతుంది’’ అని నవంబర్ 4న గురుపత్వంత్ ఒక వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో హెచ్చరికను పరిగణనలోకి తీసుకొని అతడిపై ఎన్ఐఏ అధికారులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఐపీసీలోని సెక్షన్ 120బీ, 153ఏ,506 కింద, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) -1967లోని సెక్షన్ 10,13,16,17,18,18బీ, 20 కింద పన్నూపై కేసులు పెట్టారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఖలిస్థాన్ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే సిఖ్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ ఒకడు. 2007లో దీన్ని స్థాపించగా.. 2019లో భారత్ దాన్ని నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద గురుపత్వంత్‌ను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.