Nuke Installations : భారత్-పాక్ ‘అణ్వస్త్ర’ చిట్టాలు బదిలీ.. 34వసారీ ఇచ్చిపుచ్చుకున్న దాయాదులు
దిశ, నేషనల్ బ్యూరో : భారత్(India), పాకిస్తాన్(Pakistan) తమ దేశాల్లోని అణ్వస్త్ర స్థావరాల జాబితాను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : భారత్(India), పాకిస్తాన్(Pakistan) తమ దేశాల్లోని అణ్వస్త్ర స్థావరాల జాబితాను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ఒక దేశంలోని అణ్వస్త్ర స్థావరాల(Nuke Installations)పై మరొక దేశం దాడి చేయకూడదనే షరతుతో 1988 డిసెంబర్ 31న కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ జాబితాలను భారత్, పాక్‌లు గత మూడు దశాబ్దాలుగా ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఆ సంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలోనే ఈసారి కూడా జనవరి 1న (బుధవారం) అణ్వస్త్ర స్థావరాల జాబితాను పరస్పరం బదిలీ చేసుకున్నాయి. ఈమేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ సమస్యతో పాటు సీమాంతర ఉగ్రవాదంపైనా రెండు దేశాల మధ్య జాబితా మార్పిడి జరిగిందని తెలిపింది. ఈ జాబితాను ఇచ్చిపుచ్చుకోవడం ఇది 34వసారి అని వెల్లడించింది.
183 మంది భారతీయ ఖైదీలను విడుదల చేయండి
జైలుశిక్ష గడువు ముగిసిన 183 మంది భారత పౌరులను(civilian prisoners) విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని పాకిస్తాన్‌ను భారత్ ఈసందర్భంగా కోరింది. భారత్‌కు చెందిన 18 మంది ఖైదీలకు అత్యవసరంగా భారత రాయబార కార్యాలయం సహాయాన్ని పొందే అవకాశాన్ని కల్పించాలని పాకిస్తాన్‌కు సూచించింది. తమ దేశంలోని జైళ్లలో ఉన్న 381 మంది పాకిస్తానీ ఖైదీలు, కస్టడీలో ఉన్న 81 మంది పాకిస్తానీ మత్స్యకారుల వివరాలను పేర్లతో సహా పాకిస్తాన్‌కు భారత్ అందించింది. తమ దేశంలోని జైళ్లలో ఉన్న 49 మంది భారతీయ ఖైదీలు, కస్టడీలో ఉన్న 217 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను పేర్లతో సహా భారత్‌కు పాక్ అందించింది. భారత్, పాక్‌లు రెండేళ్లకోసారి జనవరి1, జులై 1 తేదీల్లో ఈవివరాలతో జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటాయి. 2014 నుంచి ఇప్పటివరకు 2,639 మంది భారతీయ మత్స్యకారులు, 71 మంది భారతీయ ఖైదీలను పాకిస్తాన్ విడుదల చేసింది. 2023 నుంచి ఇప్పటివరకు 478 మంది భారతీయ మత్య్సకారులు, 13 మంది భారతీయ ఖైదీలను పాక్ రిలీజ్ చేసింది.