KHALISTAN: ఖలిస్తాన్ మద్దతుదారులకు కెనడా షాక్

ఖలిస్తాన్ మద్దతుదారులకు షాకిచ్చిన కెనడా సర్కారు

Update: 2024-10-06 22:30 GMT

ఖలిస్తాన్ మద్దతుదారులు స్వర్గధామంగా భావించే కెనడా..వారికి ఊహించని షాక్ ఇచ్చింది. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై తమకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ మినిస్టర్ డేవిడ్ మారిసన్ స్పష్టం చేశారు. ‘భారతదేశ ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం కెనడా విధానం.’ అని పేర్కొన్నారు. దీంతో ఇన్నాళ్లుగా కెనడా దేశం వేదికగా జరుగుతున్న ఖలిస్తాన్ పోరాటానికి అక్కడి ప్రభుత్వం ఎటువంటి మద్దతు ఇవ్వడం లేదన్నది బట్టబయలైంది. అదే సమయంలో దాదాపుగా 1980 నుంచి ఖలిస్తాన్ ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ కెనడాలో జరుగుతున్న ర్యాలీలపై మారిసన్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ వాక్ స్వేచ్ఛ ఉంటుంది. దాని ఆధారంగానే వాళ్లు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే, ఇది కెనడా విధానం మాత్రం కాదు’ అని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు

భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనకు గత ఏడాది కెనడా పార్లమెంట్ ఒక నిమిషంపాటు మౌనం పాటించింది. ఈ సందర్భంగా కెనడా ప్రధాని నిజ్జర్ హత్యకు భారత్ కారణమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. నిజ్జర్ హత్య భారత్ చేసిందని ప్రధాని ట్రూడర్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. కెనడాలోని సీనియర్ దౌత్యాధికారిని తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించడం.. భారత్ కు ఆగ్రహాన్ని కలిగించింది. భారత్ కూడా అక్కడి దౌత్యాధికారులను పంపించడంతోపాటు వీసాలపైనా ఆంక్షలు విధించింది.

కనిష్క ఘటనపై మౌనం

కెనడా ఖలిస్తాన్ మద్దతుదారులకు బహిరంగంగానే సపోర్ట్ చేసింది. అయితే, 1985లో జరిగిన ఎయిరిండియా ‘కనిష్క’ విమానాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు బాంబులతో పేల్చివేయడంపై కూడా మౌనంగా ఉండటంతో దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కెనడా దేశీయులు ఎక్కువమంది చనిపోయారు. అదే సమయంలో కెనడా గడ్డపైనే హైజాక్ కుట్ర జరిగిందని.. కెనడా పాస్ పోర్ట్ ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారులే నిందితులని భారత ప్రభుత్వం ప్రకటించినా.. విచారణకు కూడా ఆ ప్రభుత్వం డిమాండ్ చేయలేదు.

కెనడాలోనే సిక్కుల ఉద్యమం ఎందుకు?

సమస్యను తుంచాలన్నా.. పెంచాలన్నా రాజకీయాలే కీలకం. అలాగే 1975 ఇండో పాక్ యుద్ధంలో భారత్, రష్యా మైత్రి బంధం బలపడటం.. ఆపై ఆఫ్గనిస్తాన్ పై రష్యా దాడికి భారత్ సహకరించడంతో అగ్రదేశాలకు మింగుడుపడలేదు. భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు పాక్ మద్దతుతో సిక్కులకు చిరకాల కల అయిన ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రోత్సహించాయి. ఈ క్రమంలోనే కెనడా ఖలిస్తాన్ మద్దతుదారులకు ఉదారంగా వీసాలు మంజూరుచేయడంతోపాటు మద్దతుగా నిలిచింది.

రాజకీయాల్లో భాగంగానే..

ప్రస్తుతం భారత్ లో వేర్పాటువాద అంశం ఉనికిలో లేకపోయినా..

కెనడాలో సిక్కు ఉద్యమాన్ని అక్కడి రాజకీయ పార్టీలు ప్రోత్సహించడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

వాక్ స్వేచ్ఛ

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్వయంగా వాక్ స్వేచ్ఛ అనేది ఓ భ్రమ మాత్రమే పలుమార్లు అంతర్జాతీయ వేదికపైనే చెప్పారు. అయితే, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలు మాత్రం వాక్ స్వేచ్ఛను ఇతర దేశాల్లో అస్థిరతను సృష్టించేందుకు వాడుతున్నాయి. తమ కంట్లో నలకలా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్న గొంతును ఈ దేశాలు బలపరుస్తాయి. అయితే, అన్ని దేశాల్లో ఇదే సిద్ధాంతం అమలుచేయరు. ఎక్కడైతే దేశ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేదో.. అక్కడ ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. కెనడాలో కూడా ఖలిస్తాన్ ఉద్యమం వెనుక అంతర్జాతీయ రాజకీయ ప్రభావం ఉన్నది. హర్ దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోకి దొంగ పాస్ పోర్ట్ తో వచ్చాడు. అతడిని అక్కడి ప్రభుత్వం విచారణ కూడా చేసింది. భారతదేశంలో ఉంటే ప్రభుత్వం చంపేస్తుందన్న వాదన తెచ్చి రాజకీయ ఆశ్రయం తీసుకున్నాడు. అంతకుముందే అతడు తీవ్రవాది అని.. తమకు అప్పగించాలని భారత్ చేసిన వినతిని తోసిపుచ్చింది. అయితే, ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రోత్సహించడంపై అంతర్జాతీయంగా కెనడా కూడా ఇబ్బంది పడుతున్నది. తీవ్రవాదుల అడ్డాగా దేశాన్ని మార్చుతున్నారన్న ఆరోపణలకు బదులు చెప్పలేకపోతున్నది. అక్కడి సిక్కు సంఘాలకు ఇతర దేశాలనుంచి భారీ ఎత్తున మనీలాండరింగ్ జరుగుతున్నా.. ప్రభుత్వం కిమ్మనడంలేదు. అయితే, పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ 2018లో దేశానికి తీవ్రవాద ముప్పు పేరిట విడుదల చేసిన రిపోర్ట్ లో ఖలిస్తాన్ ఉద్యమం చేస్తున్న సంఘాల పేర్లు కూడా ఉన్నాయి. అయితే, కెనడాలో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో సిక్కులు ఉండటంతో అక్కడి ప్రభుత్వం సిక్కు ఉద్యమం పేరు తొలగించడం గమనార్హం.

రాజకీయ లబ్ధి

భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు రెండు కోట్ల సిక్కు జనాభా ఉన్నది. దేశ జనాభాతో పోల్చితే వీరు 1.7శాతం. కెనడాలోనూ సిక్కులు దాదాపుగా 2 శాతం మంది ఉన్నారు. కెనడా పార్లమెంట్‌‌లో 443 స్థానాలు ఉంటే అధికార ట్రూడర్ లిబరల్ పార్టీ 159 స్థానాలు దక్కించుకున్నది. అందులో 13మంది సిక్కులు ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ పక్షాన నలుగురు గెలిచారు. మరొకరు ఎన్డీపీ అనే పార్టీ తరఫున విజయం సాధించారు. దేశంలోనే బలమైన కమ్యూనిటీ అందరూ ఐకమత్యంగా ఉండటంతో వీరిని మైనారిటీలుగా గుర్తించి అన్ని పార్టీలు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అక్కడి రాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తుంటాయి. 


Similar News