26/11ఉగ్రదాడిలో కీలక సూత్రధారి పాకిస్థాన్‌లో మృతి!

26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ ఆజం చీమా(70) పాకిస్థాన్‌లో మరణించినట్టు తెలుస్తోంది.

Update: 2024-03-02 06:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ ఆజం చీమా(70) పాకిస్థాన్‌లో మరణించినట్టు తెలుస్తోంది. ఫైసలాబాద్‌ నగరంలో ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఆజం 2006 జూలై ముంబైలో రైలు బాంబు దాడి, 2008 ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరు. అంతేగాక దేశంలో జరిగిన పలు ఉగ్ర ఘటనల్లోనూ ఆజం పాత్ర ఉంది. 2008లోనే పాక్‌లోని బలవర్ పూర్‌లో ఎల్ఈటీ కమాండర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ముంబై ఉగ్రదాడికి సంబంధించిన ప్రణాళికను రచించి అమలు చేశాడు. ఎల్ఈటీ కార్యకలాపాల్లోనూ ఆజం కీలక వ్యక్తి అని అమెరికా గతంలో అభివర్ణించింది. ఎల్ఈటీ కార్యకర్తల హత్యల వెనక భారత ఏజెన్సీల హస్తం ఉందని గతంలో పాక్ ఆరోపించగా..భారత్ ఖండించింది. కాగా, 2008 నవంబర్ 26న10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా దక్షిణ ముంబై ప్రాంతాల్లోకి ప్రవేశించి తాజ్ హోటల్‌తో సహా అనేక ప్రదేశాల్లో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది మరణించగా, 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో పాల్గొన్న టెర్రిరిస్టులకు ఆజం శిక్షణ ఇచ్చినట్టు భావిస్తారు.  

Tags:    

Similar News