బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్..శుభాకాంక్షలు తెలిపిన మోడీ

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. అత్యధిక సీట్లలో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 412, కన్జర్వేటివ్ పార్టీ 121, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 71, ఇతరులు 76 స్థానాల్లో గెలుపొందారు.

Update: 2024-07-05 14:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. అత్యధిక సీట్లలో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 412, కన్జర్వేటివ్ పార్టీ 121, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 71, ఇతరులు 76 స్థానాల్లో గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 320 సీట్ల మెజారిటీ మార్కును లేబర్ పార్టీ సొంతంగా సాధించింది. దీంతో 14ఏళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేపట్టనుంది. ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కేవలం 121 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్టు సునాక్ ప్రకటించారు. ఓటమి ఎదురైనందుకు పార్టీకి క్షమాపణలు తెలిపారు. నూతన ప్రధాని కీర్ స్టార్మర్‌కు అభినందనలు చెప్పారు. అనంతరం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్‌ను కలిసి తన రిజైన్ లెటర్ అందజేశారు. దీనికి చార్లెస్ ఆమోదం తెలిపారు.

నూతన పీఎంగా కీర్ స్టార్మర్

లేబర్ పార్టీ ఘన విజయంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానిగా నియమితులయ్యారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆయన బకింగ్ హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్-3ని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. దీనికి రాజు అంగీకరించినట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం ప్రజలను ఉద్దేశించి స్టార్మర్ ప్రసంగించారు. దేశంలో ఈ రోజు నుంచి మార్పు రాబోతుందని తెలిపారు. దేశాన్ని మొత్తం పునర్:వ్యవస్థీకరిస్తామని చెప్పారు. పరిస్థితులు మారాలంటే కొంత సమయం పడుతుందన్నారు. ‘మీరు మాకు స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు. మార్పును తీసుకురావడానికి దానిని ఉపయోగిస్తాం. అలాగే రాజకీయాల్లో గౌరవాన్ని పునరుద్ధరిస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని స్టార్మర్ చేసిన వాగ్దానమే ఆయన విజయానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

యూకే ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న కీర్ స్టార్మర్‌కు భారత ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. లేబర్ పార్టీ నేత స్టార్మర్‌తో సానుకూల సహకారం కోసం తాను ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘యూకే ఎన్నికలలో భారీ విజయం సాధించిన స్టార్మర్‌కి హృదయపూర్వక అభినందనలు. పరస్పర వృద్ధి, శ్రేయస్సును పెంపొందిస్తూ, అన్ని రంగాల్లో భారత్-బ్రిటన్‌లు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు. అలాగే మాజీ ప్రధాని సునాక్ కూడా సందేశం ఇచ్చారు. ‘సునాక్‌ అద్భుతమైన నాయకత్వం ఇరు సంబంధాలను బలోపేతం చేసింది. ఆయన చేసిన కృషికి ధన్యవాదాలు’ అని తెలిపారు.

26 మంది భారత సంతతి వ్యక్తుల గెలుపు!

బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు సత్తా చాటారు. మొత్తం 127 మంది భారత మూలాలున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయగా..26 మంది గెలుపొందారు. అందులో లేబర్ పార్టీ నుంచే అత్యధికంగా ఎన్నికైనట్టు తెలుస్తోంది. గతంలో 15 మంది భారత సంతతి వ్యక్తులు ఎంపీలుగా ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 26కు చేరుకుంది. భారత సంతతి వ్యక్తులైన ప్రముఖుల్లో రిషి సునాక్‌తో సహా, కనిష్క నారాయణ్, సుయెల్లా బ్రేవర్ మన్, మొహింద్రా, నవేందు మిశ్రా, సత్వీర్ కౌర్ తదితరులున్నారు.


Similar News