Neera Tanden | జో బిడెన్ సలహాదారుగా భారతీయ మహిళ నీరా టాండన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కార్యవర్గంలో మరో భారతీయ సంతతి మహిళకు స్థానం లభించింది. ఇండో అమెరికన్ నీరా టాండన్‌ను (Neera Tanden) తన సలహాదారుగా ప్రెసిడెంట్ బైడెన్ నియమించారు.
దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కార్యవర్గంలో మరో భారతీయ సంతతి మహిళకు స్థానం లభించింది. ఇండో అమెరికన్ నీరా టాండన్‌ను (Neera Tanden) తన సలహాదారుగా ప్రెసిడెంట్ బైడెన్ నియమించారు. దేశీయ విధాన ఎజెండాను రూపొందించడం, అమలు చేయడంలో సహాయపడటానికి ఆమెను తన సలహాదారుగా (Domestic Policy Advisor) బైడెన్ నియమించారు. జాతి సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, ఇమ్మిగ్రేషన్, విద్య రంగాల్లో దేశీయ విధాన రూపకల్పన కోసం టాండన్ సలహాదారుగా పనిచేస్తారని వెల్లడించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో సుసాన్ రైస్ పనిచేశారు.
దీంతో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ప్రధానమైన మూడు పాలసీ కౌన్సిళ్లలో ఒకదానిని నాయకత్వం వహిస్తున్న మొదటి ఏషియన్-అమెరికన్‌గా టాండన్ చరిత్రలో నిలిచారని బైడెన్ అన్నారు. పబ్లిక్ పాలసీలు రూపొందించండంలో నీరాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది, ముగ్గురు అధ్యక్షుల వద్ద పనిచేశారని బిడెన్ చెప్పారు.
ఇప్పటివరకు నీరా టాండన్ తో కలిపి మొత్తం 130 మందికిపైగా భారతీయులు బైడెన్ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. ఆ దేశంలో సుమారు ఒక శాతం మాత్రమే ఉన్న ఇండో అమెరికన్లకు ఈ స్థాయిలో ప్రాతినధ్యం లభించడం విశేషం. గతంలో ట్రంప్ కార్యవర్గంలో 80 మంది, ఒబామా కార్యవర్గంలో 60 మంది ఇండో అమెరికన్లు కొలువుదీరారు.