Italy: ఆడి(Audi) టాప్ ఎగ్జిక్యూటివ్ ఫాబ్రిజియో లాంగో మృతి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి(Audi) యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్ 62 ఏళ్ల ఫాబ్రిజియో లాంగో (Fabrizio Longo) 10,000 అడుగుల పర్వతం నుండి కిందపడి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-09-03 20:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి(Audi) యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్ 62 ఏళ్ల ఫాబ్రిజియో లాంగో (Fabrizio Longo) 10,000 అడుగుల పర్వతం నుండి కిందపడి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఫాబ్రిజియో లాంగో ఆదివారం రోజు ఇటాలియన్-స్విస్ సరిహద్దు సమీపంలో ఉన్న పర్వతాన్ని ఎక్కడానికి వెళ్ళాడు. పర్వతాన్ని ఎక్కే సమయంలో అనుకోని ప్రమాదం జరిగి లోయలో పడ్డట్లు సమాచారం.లాంగో పర్వతాన్ని ఎక్కే సమయంలో అవసరమైన భద్రతా పరికరాలను ఉపయోగించినప్పటికీ ఈ ప్రమాదం సంభవించింది. అతను పడిపోవడం గమనించిన తోటి పర్వతారోహకులు వెంటనే రెస్క్యూ టీంకి సమాచారం చేరవేశారు.దీంతో వారు వెంటనే హెలికాప్టర్ లో ఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ సిబ్బంది లాంగో మృతదేహాన్ని 700 అడుగుల లోయలో కనుగొన్నారు. అతని మృతదేహాన్ని సమీపంలోని ఇటాలియన్ పట్టణం కారిసోలోకు తరలించినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు.

ఫాబ్రిజియో లాంగో 1962 సంవత్సరంలో ఇటలీ(Italy)లోని రిమినిలో జన్మించాడు.1987లో ఆటోమొబైల్ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించిన లాంగో, ఫియట్‌తో సహా కొన్ని ప్రముఖు కంపెనీల్లో పని చేశారు. 2012లో ఆడి కంపెనీలో చేరిన అతను ఒక సంవత్సరం తర్వాత ఆడి ఇటాలియన్ విభాగానికి అధిపతిగా పదోన్నతి పొందారు.అతను 2013 నుండి ఆడి ఇటలీకి డైరెక్టర్‌గా ఉన్నారు.ఫాబ్రిజియో లాంగో మరణ వార్తపై ఆడి ప్రతినిధి ఒకరు విచారం వ్యక్తం చేశారు. లాంగో "గొప్ప సమగ్రత కలిగిన వ్యక్తి" అని ఓ ప్రముఖ పత్రికతో అన్నారు. అలాగే ఇంటర్నేషనల్ స్కీ అండ్ స్నోబోర్డ్(Ski and Snowboard ) ఫెడరేషన్ కూడా ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.


Similar News