G7 సమ్మిట్‌ నాయకులను ‘నమస్తే’తో పలకరించిన ఇటలీ పీఎం జార్జియా మెలోని

G7 సమ్మిట్‌‌లో పాల్గొనడానికి పలు దేశాల నాయకులు, ప్రతినిధులు గురువారం ఇటలీకి చేరుకున్నారు.

Update: 2024-06-14 03:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: G7 సమ్మిట్‌‌లో పాల్గొనడానికి పలు దేశాల నాయకులు, ప్రతినిధులు గురువారం ఇటలీకి చేరుకున్నారు. అయితే సమ్మిట్‌కు వస్తున్న వారికి ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ భారత సాంప్రదాయమైన "నమస్తే''తో పలకరించారు. సాధారణంగా ఇతర దేశాల్లో షేక్‌హ్యండ్‌తో గౌరవంగా పలకరించుకుంటారు. అలాంటిది ప్రపంచ నాయకులు కలుసుకునే చోట ఒక దేశ ప్రధాని సాంప్రదాయ భారతీయ పలకరింపుతో స్వాగతించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ , జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌లను ఇటలీ పీఎం 'నమస్తే'తో పలకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఈ ఏడాది G7 సమ్మిట్‌ను ఇటలీ నిర్వహిస్తోంది. జూన్ 13-15 వరకు దక్షిణ ఇటలీలోని అపులియా నగరంలోని బోర్గో ఎగ్నాజియా (ఫాసనో)లో సమ్మిట్‌ జరుగుతుంది. సమ్మిట్ మొదటి రోజున, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, UK ప్రధాన మంత్రి రిషి సునక్, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా, ఇటలీ పీఎం జార్జియా మెలోని శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఇటలీ పీఎం ఆహ్వానం మేరకు, జూన్ 14న జరిగే G7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మోడీ ఇప్పటికే అక్కడికి వెళ్లారు. ఇది భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేసిన మొదటి విదేశీ పర్యటన. ఈ ఏడాది G7 సమ్మిట్‌లో రష్యా-ఉక్రెయిన్ వివాదం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, కృత్రిమ మేధస్సు (AI), వాతావరణ మార్పు వంటి కొన్ని కీలక అజెండాలు ఉన్నాయి.


Similar News