Israyel Iran: హమాస్ చీఫ్ హత్య..ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ ఆదేశాలు!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన వైమాణిక దాడిలో హమాస్ చీఫ్ హనియా మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

Update: 2024-08-01 08:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన వైమాణిక దాడిలో హమాస్ చీఫ్ హనియా మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఆదేశించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. హనియా హత్యకు గురైనట్టు ఇరాన్ మీడియా ప్రకటించిన కాసేపటికే..ఇరాన్‌లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యున్నత సమావేశం జరిగిందని, ఈ మీటింగ్‌లోనే ఖమేనీ ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటువంటి సమావేశం అసాధారణ పరిస్థితులలో మాత్రమే జరుగుతుందని, అంతకుముందు ఏప్రిల్‌లో, సిరియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు ఇరాన్ సైనిక కమాండర్లు మరణించిన తర్వాత ఇదే విధమైన సమావేశం జరిగింది. దీంతో ఇరు దేశాల మధ్య ఏం జరగబోతుందోననే ఆందోళన నెలకొంది.

హమాస్ చీఫ్ హత్యలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని హమాస్ ఆరోపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం హమాస్ ఆరోపణలను ఖండించింది. అయితే గాజా యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న దాడి సందర్భంగా ఇస్మాయిల్ హనియా, ఇతర హమాస్ నాయకులను చంపుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. అంతేగాక విదేశాలలో శత్రువులను చంపిన చరిత్ర సైతం ఇజ్రాయెల్‌కు ఉంది. దీంతో హనియా హత్యలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇరాన్, దాని మద్దతు గల దేశాలు ఏదైనా దాడి చేస్తే ఇజ్రాయెల్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు హనియా మృతదేహాన్ని గురువారం ఖతార్ రాజధాని దోహాకు తీసుకెళ్లి, రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News