మాల్దీవులకు మళ్లీ పాత మిత్రుడు గుర్తొచ్చాడా?
భారత్ వ్యతిరేక క్యాంపెయిన్‌తో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన మల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మన దేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పట్లాగా కాకుండా ఎన్నికైన తర్వాత తొలిగా ఢిల్లీకి కాకుండా చైనాకు పర్యటన చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్ వ్యతిరేక క్యాంపెయిన్‌తో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన మల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మన దేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పట్లాగా కాకుండా ఎన్నికైన తర్వాత తొలిగా ఢిల్లీకి కాకుండా చైనాకు పర్యటన చేశారు. ప్రస్తుతం మాల్దీవులు విదేశీమారక నిల్వలు నిండుకోవడంతో ఆర్థిక కష్టాల్లో పడింది. మళ్లీ పాతమిత్రుడు గుర్తుకు వచ్చారు. ఐదు రోజుల పర్యటన చేయడానికి ఆదివారం ఇక్కడ అడుగు పెట్టిన ముయిజ్జు సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి భారత్ ఆ దేశానికి భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రూ. 6,300 కోట్ల ప్యాకేజీని ఇవ్వడానికి నిర్ణయించింది. ఉభయ దేశాల మధ్యనున్న ద్వైపాక్షిక సంబంధాలను ఆర్థిక, మేరీటైమ్ సెక్యూరిటీ భాగస్వామ్యంగా మార్చుకోవడానికి ఉభయ దేశాలు అంగీకరించాయి. ఐదు ఒప్పందాలు కుదిరాయి.
కరెన్సీ స్వాప్ డీల్:
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, భారత ప్రధాని మోడీల భేటీ తర్వాత కీలక ప్రకటన చేశారు. మాల్దీవులకు కరెన్సీ స్వాప్ డీల్ ప్రకటించారు. 400 మిలియన్ డాలర్లు అమెరికా కరెన్సీలో వ్యాపారం చేయగలిగేలా.. మరో రూ 3 వేల కోట్లు భారత కరెన్సీలో వ్యాపారం చేయగలిగేలా ఈ ప్యాకేజీ భారత్ ఇవ్వనుంది. ‘ఈ ఏడాది ఎస్‌బీఐ 100 మిలియన్ డాలర్ల విలువైన ట్రెజరీ బిల్లులను విడుదల చేసిందని, ఈ రోజు మాల్దీవుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 400 మిలియన్ డాలర్లు, రూ. 3,000 కోట్లు కరెన్సీ స్వాప్ ఒప్పందం చేశాం’ అని మోడీ వివరించారు. ‘ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాలు బలోపేతం చేసేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చను మొదలు పెట్టాం. స్థానిక కరెన్సీల్లోనే వ్యాపార సెటిల్‌మెంట్లు చేసుకునేలా ఆలోచనలు చేస్తున్నాం. మాల్దీవుల ప్రజల పురోగతికి సాధ్యమైన సహాయం చేస్తూనే ఉంటాం’ అని తెలిపారు. మరో నెలన్నరకు సరిపడా విదేశీ మారక నిల్వలు మాత్రమే ప్రస్తుతం మాల్దీవుల వద్ద ఉన్నాయి.
ఈ సమావేశంలో ఐదు కీలక ఒప్పందాలు కుదిరాయి. కరెన్సీ స్వాప్ ఒప్పందం, జ్యుడీషియల్ అధికారులకు శిక్షణ, అవినీతి నిరోధం, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ట్రైనింగ్, క్రీడా మరియు యువతకు సంబంధించిన వ్యవహారాలపై ఒప్పందాలు జరిగాయి. అలాగే.. మాల్దీవుల్లో రూపే కార్డును ఇద్దరు నాయకులు విడుదల చేశారు. 700 సోషల్ హౌజింగ్ యూనిట్లను అందించిన ప్రధాని మోడీ హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వే ప్రారంభించారు.
మా మిత్ర దేశం:
మాల్దీవులకు ఏ సంక్షోభం వచ్చినా తొలుత స్పందించేది భారతేనని ప్రధాని మోడీ వివరించారు. కోవిడ్ మహమ్మారి నుంచి తాగు నీటి కొరత వరకు అన్ని వేళలా భారత్ అండగా నిలిచిందని తెలిపారు. మాల్దీవులతో భారత్ సంబంధాలు పురాతనమైనవని చెప్పారు. మాల్దీవ్స్ తమకు దగ్గరి, మంచి మిత్రుడని వివరించారు. ఒక పొరుగు దేశంగా భారత్ తన బాధ్యతలను విస్మరించకుండా నిర్వర్తించిందని స్పష్టం చేశారు.
భారత్ ముఖ్యమైన భాగస్వామి:
భారత్ అందిస్తున్న ఆర్థిక సహాయం ప్రస్తుతం తమ దేశం ఎదుర్కొంటున్న సమస్య నుంచి గట్టెక్కడానికి ఉపయోగపడుతుందని మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయిజ్జు అన్నారు. హిందూ మహాసముద్ర రీజియన్‌లో శాంతి సుస్థిరత కోసం ప్రజాస్వామిక, సంపన్నమైన, ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే మాల్దీవ్స్ దేశం, భారత్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఈ రీజియన్‌లో మేరిటైమ్ సెక్యూరిటీకి ఉభయ దేశాలు ముఖ్యమైన భాగస్వాములని తెలిపారు. భారత్, మాల్దీవుల ప్రజల మధ్య సంబంధాలు పురాతనమైనవని, గాఢమైనవని వివరించారు. ఇప్పటికీ వైద్య, విద్య సహా చాలా అవసరాల కోసం భారత్‌కు వస్తుంటారని, మాల్దీవులకు భారత పర్యాటకులు చాలా ముఖ్యమని చెప్పారు. వచ్చే ఏడాది ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండుతాయని, ఈ సందర్భంగా భారత ప్రధాని తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించారు. ఈ పర్యటనకు ప్రధాని మోడీ అంగీకరించారు.