లావోస్ పర్యటనకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు లావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : అక్టోబర్ 10, 11 తేదీల్లో మోడీ లావోస్ లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈసందర్భంగా మోదీ 21వ ఆసియాన్-ఇండియా (ఆసియన్), ఇండియా సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా (ఎంఈఏ) సదస్సులో పాల్గొంటారని పేర్కొంది. ప్రస్తుతం ఆసియాన్-ఇండియాకు లావోస్ అధ్యక్షత వహిస్తోంది. ఈ సమావేశాల్లో భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశముందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోడీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లోనూ పాల్గొంటారని సమాచారం. భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్దకాలం అవుతోందని.. ఈ పాలసీ ఇండో-పసిఫిక్ అభివృద్ధికి కీలకమైందని విదేశాంగ శాఖ పేర్కొంది.
ప్రధాని మోడీ ఇటీవల వరుసగా ఇటలీ, రష్యా, అస్ట్రియా, పోలెండ్, ఉక్రెయిన్, బ్రూనై, సింగపూర్, అమెరికా దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత పర్యటనలో ఉన్నారు. ముయిజ్జు కూడా తమ దేశ పర్యటనకు రావాలని మోడీని ఆహ్వానించారు. అందుకు మోడీ సైతం సానుకూలంగా స్పందించారు. ప్రధానిగా మోడీ తన పదవీ కాలంలో 72 దేశాలలో పర్యటించడం విశేషం.