Israeli rockets: ఆగని ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 22 మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది. దక్షిణ గాజా నగరంలో ఓ పాఠశాలపై రాకెట్లతో దాడి చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్‌లో హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ శనివారం దక్షిణ గాజా నగరంలో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఓ పాఠశాలపై రాకెట్లతో దాడి చేసింది. ఈ ఘటనలో 22 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 13 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నట్టు వెల్లడించింది. పాఠశాల సైతం పూర్తిగా ధ్వంసమైనట్టు తెలిపింది. స్కూల్ గ్రౌండ్‌లో పిల్లలు ఆడుకుంటుండగానే రెండు రాకెట్లతో అటాక్ చేసినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా దాడికి పాల్పడినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
లెబనాన్‌లో 31 మంది మృతి
లెబనాన్ రాజధాని బీరూట్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 31 మంది మరణించారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. వారిలో ముగ్గురు పిల్లలు, ఏడుగురు మహిళలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే సీనియర్ నాయకుడు ఇబ్రహీం అకిల్, హిజ్బొల్లా కు చెందిన మరో అగ్ర కమాండర్ అహ్మద్ వహ్బీతో సహా 16 మంది సభ్యులు ఉన్నారని వెల్లడించింది. దీంతో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో మరణించిన వారి సంఖ్య 740కి చేరుకుంది.