రఫాపై ఇజ్రాయెల్ వైమాణిక దాడి..35 మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడగా, దానికి ప్రతీకారంగా దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడి చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడగా, దానికి ప్రతీకారంగా దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడి చేసింది. ఈ దాడిలో 35 మంది పాలస్తీనియన్లు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అటాక్‌ను ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ధ్రువీకరించింది. రఫాలోని హమాస్ స్థావరంపై మాత్రమే దాడికి పాల్పడ్డామని, ఇద్దరు సీనియర్ హమాస్ ఉగ్రవాదులు కూడా ఈ దాడిలో మరణించినట్టు తెలిపింది. అయితే పౌరులకు హాని జరిగినట్టు వచ్చిన నివేదికలపై దర్యాప్తు చేపట్టామని పేర్కొంది.
శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న ఈ ప్రాంతాలను సైన్యం సురక్షిత ప్రాంతాలుగా ప్రకటించిందని పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ చేయొద్దని ఆదేశించిన వాటిలో ఇది ఒకటని తెలిపింది. ఈ ప్రాంతంలో రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాగా, అంతర్జాతీయ న్యాయస్థానం ఇటీవలే రఫాపై దాడి చేయొద్దని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాడులు జరగడం గమనార్హం.
అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. రఫా నగరం నుంచే ఈ రాకెట్లను ప్రయోగించినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ మారణకాండకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు హమాస్ రక్షణ విభాగం అల్-ఖాసిమ్ బ్రిగేడ్ తెలిపింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం టెల్ అవీవ్‌తో పాటు అనేక నగరాల్లో సైరన్లు మోగించింది. తీవ్ర దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. జనవరి తర్వాత ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మొదటి అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్ వెల్లడించలేదు. మరోవైపు ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోనూ దాడి చేసినట్టు లెబనాన్ అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడిలో ఏడుగురు హిజ్భొల్లా మిలిటెంట్లు మరణించినట్టు పేర్కొంది.