ఎట్టకేలకు గాజాలో అల్ షిఫా హాస్పిటల్‌ డైరెక్టర్‌ను విడుదల చేసిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-07-01 10:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడు నెలలకు పైగా నిర్బంధంలో ఉన్న గాజాలో అతి పెద్ద ఆసుపత్రి అయిన అల్ షిఫా డైరెక్టర్‌ మొహమ్మద్ అబు సెల్మియాను ఇజ్రాయెల్ సోమవారం విడుదల చేసింది. గతంలో ఇజ్రాయెల్‌‌ పైకి దాడి చేయడానికి షిఫా హాస్పిటల్‌‌ను హమాస్ కమాండ్ సెంటర్‌గా ఉపయోగించుకుందన్న ఆరోపణలతో దానిపై దాడి చేసి దాని డైరెక్టర్‌‌ను, మరికొంతమందిని బంధించింది. అబు సెల్మియా విడుదలను ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ జివిర్, గాజా స్ట్రిప్‌లోని వైద్యుల బృందం కూడా ధృవీకరించింది.

విడుదల అనంతరం సెల్మియా మాట్లాడుతూ, తనతో పాటు, ఇతర ఖైదీలను తీవ్రంగా హింసించారని, మా ఖైదీలు కటకటాల వెనుక అన్ని రకాల హింసలకు గురయ్యారని ఆయన అన్నారు. దాదాపు ప్రతిరోజూ చిత్రహింసలు జరిగేవి. లాఠీలతో చేతులు, కాళ్లపై కొట్టారు, గార్డులు తన వేలు విరగ్గొట్టారని, తన తలలో రక్తస్రావమైందని, కుక్కలను మాపై వదిలారని ఆయన చెప్పారు. వైద్యం సరిగా అందకపోవడంతో కొంత మంది ఖైదీలు దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారని సెల్మియా తెలిపారు.

అయితే అంతకుముందు కూడా ఇజ్రాయెల్ బందీలను తీవ్రంగా హింస్తుందని ఆరోపణలు రాగా, వాటిని ఖండిస్తూ, నిబంధనల ప్రకారమే ఖైదీలందరినీ చూసుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇదిలా ఉంటే అబు సెల్మియాను ఎందుకు విడుదల చేశారో ఇప్పటికి ఇజ్రాయెల్ ప్రకటించలేదు. అబు సెల్మియాతో పాటు, విడుదలైన ఇతర ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వారు విడుదలైన విషయం తెలుసుకున్న కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.

Similar News