Middle East: దక్షిణ లెబనాన్‌లో దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్
పశ్చిమాసియా మొత్తం కూడా యుద్ధాలతో వణికిపోతుంది. ప్రపంచ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ మాత్రం గాజాపై తన దాడులు ఆపడం లేదు.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియా మొత్తం కూడా యుద్ధాలతో వణికిపోతుంది. ప్రపంచ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ మాత్రం గాజాపై తన దాడులు ఆపడం లేదు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ తీవ్రమైన వైమానిక దాడులను ప్రారంభించింది. అంతకుముందు రోజు ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా గ్రూప్, ఇజ్రాయెల్ కీలకమైన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన దాడులు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందస్తుగా తిరిగి ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టింది.
ఒక సైనిక అధికారి మాట్లాడుతూ, మా భూభాగంపై "పెద్ద-స్థాయి" దాడులకు హిజ్బుల్లా సన్నాహాలు ప్రారంభించినట్లు గుర్తించాం, ఇజ్రాయెల్ పౌరులకు తక్షణ ప్రమాదం కలిగించే హిజ్బుల్లా స్థావరాలపై దృష్టి సారించి, ఈ బెదిరింపులను కట్టడి చేయడానికి యుద్ధ విమానాలను సరిహద్దులో మోహరించినట్లు తెలిపారు. అటు హిజ్బుల్లా కూడా అనేక పేలుడు డ్రోన్‌లను ఇజ్రాయెల్ కీలకమైన సైనిక సైట్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించింది. వార్తా సంస్థ AFP, స్థానిక మీడియా తెలిపిన దాని ప్రకారం, లెబనాన్ నుండి ఉత్తర ఇజ్రాయెల్‌లోకి 100కి పైగా రాకెట్లు ప్రయోగించినట్లు సమాచారం.
దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది. ముందు జాగ్రత్తగా ఆదివారం ఉదయం బెన్-గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను దారి మళ్లించింది. అలాగే మరికొన్నింటి టేకాఫ్‌లను ఆలస్యం చేస్తుంది. నెతన్యాహు కార్యాలయం నుండి ఒక ప్రకటన ప్రకారం, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ రాబోయే 48 గంటలపాటు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.