Israel - Hezbollah War : మా దేశం జోలికొస్తే తాట తీస్తాం..హెజ్‌బొల్లాకు నెతన్యాహు సీరియస్ వార్నింగ్

ఇజ్రాయెల్‌ , హెజ్‌బొల్లా మధ్య గత కొన్ని రోజులుగా భీకరమైన దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-25 19:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా మధ్య గత కొన్ని రోజులుగా భీకరమైన దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం ఈ దాడులు ఒక్కసారిగా తారస్థాయికి చేరుకున్నాయి. దాదాపు 300 రాకెట్ లాంచర్లతో హెజ్‌బొల్లా  ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ నేపథ్యంలో  తమ దేశంపై దాడికి పాల్పడిన హెజ్‌బొల్లా (Hezbollah) గ్రూప్‌పై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) నిప్పులు చెరిగారు. మా దేశం జోలికొస్తే ఊరుకోమని, మా దేశాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. అలాగే హెజ్‌బొల్లా గ్రూప్ జాగ్రత్తగా ఉండాలని , కథ ఇంకా ముగిసిపోలేదని కేబినెట్‌ సమావేశంలో నెతన్యాహు స్పష్టం చేశారు. ఉత్తర ప్రాంతంలోని ప్రజలే లక్ష్యంగా హెజ్‌బొల్లా ప్రయోగించిన షార్ట్‌ రేంజ్‌ రాకెట్లను విజయవంతంగా కూల్చివేసామని, రాబోయే రోజుల్లో హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా తీవ్రమైన దాడులు కొనసాగుతాయని నెతన్యాహు వెల్లడించారు.

హెజ్‌బొల్లా రాకెట్ లాంచర్లు ధ్వంసం..?

మరోవైపు సెంట్రల్‌ ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని హెజ్‌బొల్లా ప్రయోగించిన రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వెల్లడించింది. తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు యుద్ధం చేయడానికి కూడా సిద్ధమేనని IDF ప్రకటించింది. కాగా హెజ్‌బొల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్ర్ని చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నట్టు హెజ్‌బొల్లా స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి దాదాపు 6 వేల నుంచి 8 వేల రాకెట్లను సిద్ధంగా ఉంచింది.దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్ 100కి పైగా ఫైటర్‌ జెట్లను రంగంలోకి దింపింది.యుద్ధం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 48 గంటల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లంట్ తెలిపారు.


Similar News